వెంకటాపురంలో అగ్నికి ఆహుతైన జామాయిల్ తోటలు
ప్రమాదానికి ట్రాన్స్‌ఫార్మర్ విద్యుత్ షార్ట్ సర్క్యూటే కారణం అంటున్న రైతులు
ఎర్రుపాలెం మే 25 (విజయక్రాంతి): ఎర్రుపాలెం మండలంలోని వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని తాటిగూడెం రెవెన్యూలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో జామాయిల్ తోటలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ట్రాన్స్ఫార్మర్ వద్ద విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి వేగంగా వ్యాపించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.
బాధిత రైతులు తెలిపిన వివరాల ప్రకారం, పొలాల్లో హై ఓల్టెజ్ లైన్ల వద్ద ఏర్పాటు చేసిన ట్రాన్స్ ఫార్మర్ వద్ద షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి మొత్తం పది మంది రైతులకు చెందిన సుమారు ముప్పు ఎకరాల జామాయిల్ తోటలు మంటల్లో కాలిపోయాయి.
ఈ ఘటనలో జామాయిల్ తోటలకు సుమారు నలభై లక్షలు రూపాయలు వరకు నష్టం వాటిల్లిందని రైతులు వాపోయారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదం కారణంగా పూర్తిగా ఆర్థికంగా దెబ్బతిన్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం అందించటం జరిగిందని వారు వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించి, నష్టాన్ని అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు.






