మోకరిల్లిన మోదీ
- ట్రంప్‌నకు వ్యతిరేకంగా మోదీ పనిచేయలేరు
- మోదీ చర్యలతో భారత్‌లోనూ యుద్ధం!
- కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ
- అనంతగిరిలో డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు
- పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు రాహుల్ సమ్మతి
వికారాబాద్, మార్చి 2: పాకిస్థాన్‌కు ప్రస్తుతం చైనా మద్దతు ఇస్తున్నదని, ఇరాన్ వెనక చైనా, రష్యా ఉన్నాయని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు ప్రధాని మోదీ పూర్తిగా లొంగిపోయారని, ట్రంప్‌నకు వ్యతిరేకం గా మోదీ ఏ పనిచేయలేరని ఆరోపించారు. ప్రధాని మోదీ తప్పిదాలన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని తెలిపారు.
మోదీ నిర్ణయాలతో దేశానికి, పేద ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతున్నదన్నారు. మోదీ తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ సూచి ంచారు. ఇరాన్ లాంటి పరిస్థితులు దేశానికి రాకుండా ఉండాలన్నారు. మోదీ ప్రభుత్వ చర్యల వల్ల భారత్‌లో యుద్ధం వచ్చే పరిస్థితులు ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఇదే జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినడంతో పాటు పేద ప్రజలకు తీవ్రం గా నష్టం జరుగుతుందన్నారు. భారత్, -అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ప్రమాదకారి అని చెప్పారు.
బీజేపీది హింసావాదమని, కాంగ్రెస్ పార్టీది అహింసావాదమని రాహుల్ గాంధీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం ఎన్నటికీ హింసావాదాన్ని పాటించదని, కాంగ్రెస్‌లోని ప్రతి నాయకుడు అహింసా వాదాన్ని పాటించాలని సూచించారు. వికారాబాద్‌లోని అనంతగిరి హరిత రిసార్ట్‌లో గత పది రోజులుగా జరుగుతున్న తెలంగా ణ, ఆంధ్రప్రదేశ్ డీసీసీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి రాహుల్‌గాంధీ సోమవారం హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, సభ్యులతో ఆయన భేటీ అయ్యారు. మార్షల్ ఆర్ట్స్ చేస్తూ డీసీసీ అధ్యక్షులకు క్లాస్ చెప్పారు. ‘రాహుల్ జీ యూ జిట్స్’ అనే మార్షల్ ఆర్ట్స్‌లో మెలకువలను వివరించారు. ఈ సందర్భంగా, నాయకులు తమ అహంకారాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని రాహుల్ పిలుపునిచ్చారు. డీసీసీ అధ్యక్షులు మరో 10 మందిని తయారుచేయాలని, పనిచేస్తున్న వారిని గుర్తించాలని చెప్పారు.
డీసీసీ అధ్యక్షులు అంతా తన టీం అంటూ ఉత్తేజ పరిచారు. తెలంగాణలో పార్టీ, ప్రభుత్వం కలిసి మంచిగా పనిచేస్తున్నాయని రాహుల్ పేర్కొన్నారు. సామాజిక అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు. బీజేపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ, కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రజల్లోకి చేరవేయాలని సూచించారు.
ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టాలని పార్టీ సీనియర్ నేత వీహెచ్ హన్మంతరావు కోరగా.. అందుకు రాహుల్ సమ్మతి తెలిపారు. ఈ సమావేశానికి ఏఐసీసీ నాయకుడు కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్, రెండు తెలుగు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్, వైఎస్ షర్మిల హాజరయ్యారు.




