నగర రహదారులకు మహర్దశ
రూ. 3,145 కోట్లతో సీఆర్‌ఎంపీ రెండో దశకు జీహెచ్‌ఎంసీ గ్రీన్ సిగ్నల్
ప్రైవేటు ఏజెన్సీలకు బాధ్యత అప్పగింత
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2 (విజయక్రాంతి): భాగ్యనగరంలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించడంతో పాటు, రహదారులను అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించేందుకు జీహెచ్‌ఎంసీ భారీ ప్రణాళికను సిద్ధం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన కాంప్రాహెన్సివ్ రోడ్ మెయింటనెన్స్ ప్రొగ్రామ్ సీఆర్‌ఎంపీ,మొదటి దశ విజయవంతం కావడంతో, ఇప్పుడు మరింత మెరు గైన నిబంధనలతో రెండో దశను అమలు చేసేందుకు జీహెచ్‌ఎంసీ పచ్చజెండా ఊపిం ది. సోమవారం ప్రత్యేకాధికారి జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన కార్పొరేషన్ సమావేశంలో సీఆర్‌ఎంపీ-2 ప్రతిపాదనలకు అధికారికంగా ఆమోదం లభించింది. సుమారు రూ. 3,145 కోట్ల వ్యయంతో నగరంలోని 1,045.01 కిలోమీటర్ల మేర ప్రధాన రహదారుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు ఏజెన్సీలకు అప్పగించనున్నారు.
మూడు విభాగాలుగా రోడ్ల నిర్వహణ
నగరంలోని రహదారుల పరిస్థితిని బట్టి మూడు రకాలుగా ఈ నిర్వహణ పనులను చేపట్టాలని అధికారులు నిర్ణయించారు. ఇం దులో మొదటి విభాగం కింద 744.22 కిలోమీటర్ల మేర ఉన్న బీటీ, సీటీ రోడ్లకు రూ. 2,230 కోట్లను కేటాయించారు.రెండో విభాగంలో 64.49 కిలోమీటర్ల సీసీ రోడ్ల మెరు గైన నిర్వహణ కోసం రూ. 208 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇక మూడో విభాగం కింద మరో 236.30 కిలోమీటర్ల పొడవున్న బీటీ రోడ్ల బాధ్యతలను రూ. 707.07 కోట్లతో ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు.




