నేడు మోదీ రాక
ప్రధాని బహిరంగ సభకు పరేడ్ గ్రౌండ్‌లో సర్వం సిద్ధం
రూ.9,400 కోట్ల అభివృద్ధి పనులకు హెచ్‌ఐసీసీలో వర్చువల్‌గా శంకుస్థాపన, ప్రారంభోత్సవం
2వేల మంది లా అండ్ ఆర్డర్ పోలీసులు, 550 మంది ట్రాఫిక్ సిబ్బందితో భారీ భద్రత
ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులు
- రూ.1250 కోట్ల మేర కాజిపేట్ - విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు(118 కి.మీ.వరకు).
- పెట్రోలియం ఉత్పత్తులకు సంబంధించి రూ.610 కోట్ల మేర గ్రీన్‌ఫీల్డ్ పీవోఎల్ టెర్మినల్.
- 21 కి.మీ. వరకు రూ.300 కోట్ల మేర కాజిపేట్ రైల్వే అండర్ బైపాస్.
- రూ.1700 కోట్ల మేర వరంగల్‌లో పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్.
శంకుస్థాపన చేయనున్న ప్రాజెక్టులు
- రూ. 3180 కోట్ల విలువైన హైదరాబాద్ - పనాజీ ఎకనామిక్ కారిడార్ (గుడెబెల్లూర్ - మహబూబ్‌నగర్) ఎన్‌హెచ్-167కు శంకుస్థాపన.
- రూ.2360 కోట్ల మేర జహీరాబాద్ ఇండస్ట్రీయల్ ఏరియాకు శంకుస్థాపన.
హైదరాబాద్/సికింద్రాబాద్, మే 9 (విజయక్రాంతి): ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హైదరాబాద్‌కు రానున్నారు. హెచ్‌ఐసీసీలో వర్చువల్‌గా రూ. 9,400 కోట్ల మేర అభివృద్ధి పనులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారం భోత్సవంతో పాటు జాతికి అంకితం చేయనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరు కానున్నారు. అయితే ప్రధాని మోదీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం రేవంత్‌రెడ్డిని జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి కృష్ణప్రసాద్ ఆహ్వానం అందజేశారు.
కాగా మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారిగా మోదీ తెలంగాణకు వస్తుండటంతో భారీ భహిరంగ సభ సక్సెస్ చేసేందుకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దాదాపు రెండు లక్షలకు పైగా సభకు హాజరయ్యేలా జనసమీకరణ చేసింది. కర్ణాటకలో తొలుత పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మోదీ పాల్గొని, బెంగళూరు నుంచి హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి మధ్యాహ్నం 2.30 గంటలకు చేరుకుంటారు.
అక్కడినుంచి రోడ్డు మార్గంలో 2.55 గంటలకు హెచ్‌ఐసీసీ వేదికకు చేరుకుంటారు. మధ్యాహ్నం 3 నుంచి 3.30 గంటలకు హెచ్‌ఐసీసీలో వర్చువల్‌గా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారం భోత్సవాలు చేసి కొద్దిసేపు ప్రసంగించే అవకాశముంది. 3.35 గంటలకు కార్యక్రమ వేదిక నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 3.40 గంటలకు హైటెక్ సిటీలోని సింధు హాస్పిటల్‌కు చేరుకుంటారు. 3.45 నుంచి 4.15 వరకు హాస్పిటల్‌ను ప్రారంభిస్తారు.
సాయంత్రం 4.20 గంటలకు బయలుదేరి 4.45కు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 4.45 గంటల నుంచి 6.15 గంటల వరకు రిజర్వ్ సమయం. సాయం త్రం 6.20 గంటలకు బేగంపేట్ విమానాశ్ర యం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 6.25కు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుంటారు. 6.30 గంటల నుంచి 7 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. రాత్రి 7.10 గం టలకు రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 7.15 బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. 7.20కు విమానాశ్రయం నుంచి ప్ర త్యేక విమానంలో బయలుదేరి రాత్రి 9.20 గంటలకు గుజరాత్‌లోని జామ్నగర్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారని తెలుస్తోంది.
12 పార్కింగ్ ప్రాంతాలు
పరేడ్ గ్రౌండ్‌లో భద్రతా కారణాలు, వీవీఐపీ కాన్వాయిల రాకపోకల దృష్ట్యా పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, పారడైజ్, ప్యాట్నీ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ నియంత్రణలు, పార్కింగ్ పరిమితులు అమల్లో ఉంటాయని సీపీ సుమతి తెలిపారు. సభా ప్రాంగణం సమీపంలో వాహనాలకు అనుమతి ఉండదని, ప్రజలు కేవలం గుర్తించిన పార్కింగ్ ప్రదేశాల్లోనే వాహనాలు నిలిపివేయాలని సూచించారు.
ప్రజల సౌకర్యార్థం మొత్తం 12 ప్రత్యేక పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి, వాటికి సంబంధించిన క్యూ ఆర్ కోడ్లను కూడా అందుబాటులో ఉంచామని చెప్పా రు. ముఖ్యంగా నల్లగొండ, ఖమ్మం, వరంగల్, భువనగిరి జిల్లాల నుంచి వచ్చే బస్సు లు ఉప్పల్ స్టేడియం పార్కింగ్ వద్ద నిలిపి, అక్కడి నుంచి మెట్రో రైళ్ల ద్వారా పరేడ్ గ్రౌండ్‌కు చేరుకోవాలని సూచించారు.
నిజామాబాద్, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ నుంచి వచ్చే వాహనాలను బోయిన్‌పల్లి, తిరుమలగిరి మీదుగా వచ్చే బస్సులు ధోబీఘాట్ వద్ద ఆగాలి. మెహదీపట్నం, మహ బూబ్ నగర్, కర్ణాటక మార్గంలో రేతిబౌలి, మెహదీపట్నం, మాసబ్ ట్యాంక్ మీదుగా వచ్చే బస్సులు నెక్లెస్ రోడ్ (సంజీవయ్య పార్క్) వద్ద ఆగాలి. సంగారెడ్డి, హైటెక్ సిటీ మార్గం.. జూబ్లీ చెక్ పోస్ట్, పంజాగుట్ట మీదు గా వచ్చే బస్సులు నల్లగుట్ట వద్ద ఆగాలి.
పవన్ కళ్యాణ్‌ను పరామర్శించే అవకాశం?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇం టికి ప్రధాని మోదీ వెళ్లి కలవనున్నట్లు సమాచారం. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని హైదరాబాద్‌లోని నివాసంలో పవన్ విశ్రాం తి తీసుకుంటున్నారు. పరేడ్ గ్రౌండ్ సభ అనంతరం పవన్‌ను కలిసి పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీ నిపై అధికారిక ఎలాంటి సమాచారం లేదు.
భద్రతకు ప్రత్యేక బలగాలు
పరేడ్ గ్రౌండ్‌లో సభకు భారీ భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు చేసినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి శనివారం సికింద్రాబాద్‌లోని డీసీపీ కార్యాలయంలో మీడి యాకు వివరాలు వెల్ల డించారు. సభకు దాదాపు లక్ష మంది హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో విస్తృత స్థాయిలో బందోబస్తు చేపట్టినట్లు ఆమె చెప్పారు. బందో బస్తులో సుమారు 2వేల మంది లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటు 550 మంది ట్రాఫిక్ సిబ్బందిని విధుల్లో నియమించారు.
ముగ్గురు డీసీపీలు, ఐదుగురు అద నపు డీసీపీలు, 21 మంది ఏసీపీలు, 61 మంది ఎస్డీపీవోలు, 57 మంది సీఐలు, 226 మంది ఎస్సైలు, 12 ప్లాటూన్ల ప్రత్యేక దళాలు, 6 ఏఆర్ ప్లేషన్లు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, ఇంటెలిజెన్స్ బృందాలు, సూపర్ ఆక్టోపస్ టీమ్స్, ఐటి, కమ్యూనికేషన్ టీంలు, ఐటీ సెల్, కమాండ్ కంట్రోల్ టీమ్స్, షి టీమ్స్, స్నిఫర్ డాగ్ స్క్వాడ్, భద్రతా పర్యవేక్షణలో పాల్గొంటున్నాయని తెలిపారు.
పరేడ్ గ్రౌండ్స్ పరిసర ప్రాంతా లు, రహదారులు, పార్కింగ్ ప్రదేశాల్లో సీసీ కెమెరాల ద్వారా నిరంతర నిఘా కొనసాగుతుందని సీపీ తెలిపారు. సభ ప్రాంగణం లోకి కేవలం నిర్దేశిత గేట్ల ద్వారానే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. డ్రోన్లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, బ్యాగు లు, వాటర్ బాటిళ్లు, ప్రమాదకర వస్తువులు తీసుకురావడంపై నిషేధం విధించా మని చెప్పారు. పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో డ్రోన్ల ఎగురవేతను నిషేధిస్తున్నట్లు సీపీ చెప్పారు.
ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బేగంపేట్, బోయిన్‌పల్లి, మారేడుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ల ఎగరవేయటంపై నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట్, ప్యారడైజ్, ప్యాట్నీ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద వ్యక్తు లు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే సమాచారమివ్వాలని సూచించారు.






