19 May, 2026 | 3:57 AM

మున్నేరు వద్ద మాక్ డ్రిల్

19-05-2026 12:29 AM

మున్నేరు వద్ద నిర్వహించిన మాక్ డ్రిల్, ఎవాక్యుయేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం, మే 18(విజయక్రాంతి): వరదల సమయంలో అధికారుల సూచనలు ప్రజలు తప్పనిసరిగా పాటించి సహకరించాలని,  విపత్తుల నిర్వహణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జిల్లా యంత్రాంగాన్ని మాన్సూన్ సీజన్కు పూర్తి స్థాయిలో సిద్ధం చేసేందుకు చేపట్టిన ఫ్లడ్ మాక్ ఎక్స్సజ్ కార్యక్రమం విజయ వంతంగా నిర్వహించామని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. జిల్లాలోని మున్నేరు పరివాహక ప్రాంతంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (ఎన్.డి.ఎం.ఏ) మార్గదర్శకాలు, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహించిన వరద ప్రమాదాల మాక్ ఎక్స్సజ్ ను జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్  సోమవారం  పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ* వరదల వంటి విపత్తుల సమయంలో అధికారులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే ప్రాణనష్టం నివారించవచ్చని అన్నారు.  ఈ మాక్ డ్రిల్ ద్వారా వ్యవస్థలో ఉన్న లోపాలను గుర్తించి, భవిష్యత్తులో మరింత సమర్థవంతంగా పనిచేసేలా చర్యలు తీసుకోవచ్చన్నారు. వరదల సమయంలో ప్రజలు ముఖ్యమైన పత్రాలు, ఆభరణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్బుక్లు, భూ పత్రాలు వంటి ముఖ్యమైన డాక్యుమెంట్లు, విలువైన వస్తువులను వాటర్ ప్రూఫ్ జిప్ బ్యాగ్లలో సిద్ధంగా ఉంచుకోవాలని కలెక్టర్ సూచించారు.

ఖమ్మం జనరల్ ఆస్పత్రి వద్ద వరదలలో ఎవరైనా చిక్కుకుంటే వారిని సంరక్షించి వైద్య సేవలు అందించేలా మాక్ ఎక్స్సజ్ చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య, ఎదులాపురం మునిసిపల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్డిఆర్‌ఎఫ్ 6వ బెటాలియన్ అసిస్టెంట్ కమాండర్ బి. మరియాదాస్, ఎన్డీఆర్‌ఎఫ్ ఇన్స్పెక్టర్ ప్రదీప్ కుమార్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఏఎంవిఐ, టీజీ ఎన్పిడిసిఎల్, వైద్య, ఆరోగ్య శాఖ, పశు సంవర్థక శాఖ, మునిసిపల్, రెవెన్యూ, సివిల్ సప్లై, పోలీస్, సంబంధిత శాఖల అధికారులు, రెస్క్యూ బృందాలు, ఆపద మిత్ర వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.