రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
బోధన్,(విజయ క్రాంతి): బోధన్ పట్టణంలోని అప్నా ఫంక్షన్ హాల్‌లో సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో నిర్వహించనున్న దివ్యాంగుల రాష్ట్ర కమిటీ సమావేశాలకు హాజరు కావాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ మేరకు నిర్వాహకులు ఎమ్మెల్యేను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. దివ్యాంగుల హక్కులు, సంక్షేమం, వారి ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ఈ రాష్ట్రస్థాయి సమావేశాలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి దివ్యాంగుల ప్రతినిధులు, సంఘాల నాయకులు హాజరుకానున్నట్లు తెలిపారు.
మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో దివ్యాంగుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై విస్తృతంగా చర్చించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధానంగా దివ్యాంగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరు, దివ్యాంగుల హక్కులు, చట్టాలపై అవగాహన, పెన్షన్లు, విద్య, ఉపాధి, వైద్య సదుపాయాలు తదితర అంశాలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణను రూపొందించనున్నట్లు ఎన్‌పీఆర్‌డీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏషాల గంగాధర్ తెలిపారు. దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కుల సాధన కోసం చేపట్టాల్సిన ఉద్యమాలు, కార్యాచరణపై కూడా సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్రస్థాయి సమావేశాలకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరించాలని నిర్వాహకులు కోరారు.






