జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును ఢీకొన్న లారీ
ఇద్దరు మహిళలు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఆర్మూర్,(విజయక్రాంతి): తీర్థయాత్రకు బయలుదేరిన భక్తులకు ఆర్మూర్ మండల పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జాతీయ రహదారిపై టైర్ పంచర్ కావడంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే... మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కిన్వట్ ప్రాంతానికి చెందిన భక్తులు హైదరాబాద్‌లోని చిన్న జీయర్ స్వామి దర్శనం కోసం రెండు టూరిస్ట్ బస్సుల్లో తీర్థయాత్రకు బయలుదేరారు.
ఆర్మూర్ మండల పరిధిలోని గోవింద్‌పేట్ బ్రిడ్జి సమీపంలో జాతీయ రహదారిపై ముందుగా వెళ్తున్న టూరిస్ట్ బస్సు టిజి 01 టి 1864 టైర్ పంచర్ కావడంతో వెనకాలే ఉన్న టిజి 21 టి 2172 బస్సును జాతీయ రహదారిపై నిలిపివేశారు. టైర్ పంచర్ కావడంతో బస్సులోని కొంతమంది ప్రయాణికులు కిందికి దిగి, రహదారి మధ్యలో ఉన్న డివైడర్‌పై కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇదే సమయంలో వెనుక వైపు నుంచి వేగంగా వస్తున్న లారీ జిటి 27 టీఎఫ్ 7482 డ్రైవర్ ఆగి ఉన్న టూరిస్ట్ బస్సును బలంగా ఢీకొట్టాడు.
దీంతో ఆగి ఉన్న టూరిస్ట్ బస్సు ముందుకు కదిలి డివైడర్ ప్రాంతంలో కూర్చున్న ప్రయాణికులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుజాత ( 54 ) , మాధవి ( 47 ) అనే ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు ప్రయాణికులు సునీత, చిటక్కలకు తీవ్రంగా గాయపడటంతో వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా, పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్
ఘటన సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును సంబంధిత పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులు, వాహనాలు ఏ విధంగా నిలిపి ఉన్నాయనే అంశాలతో పాటు లారీ ఢీకొన్న తీరును అధికారులు కమిషనర్‌కు వివరించారు. అనంతరం క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని, వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేలా చర్యలు చేపట్టారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరం జాతీయ రహదారులపై వాహనాలు టైర్ పంచర్ కావడం, సాంకేతిక లోపాలు ఏర్పడటం వంటి సందర్భాల్లో వాహనాలను రహదారిపై నిలిపినప్పుడు అత్యంత జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా వాహనంలోని ప్రయాణికులు రహదారిపైకి వచ్చి డివైడర్లు లేదా రహదారి పక్కన కూర్చోవడం అత్యంత ప్రమాదకరమని తెలిపారు.
వాహనం ఆగిపోయిన వెంటనే ప్రమాద హెచ్చరిక లైట్లు ఆన్ చేయడంతో పాటు, తగిన దూరంలో రిఫ్లెక్టివ్ వార్నింగ్ ట్రయాంగిల్స్ లేదా ఇతర హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రయాణికులు కూడా రహదారిపై కాకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉండాలని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి ప్రమాదానికి గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీపీ వెంట ఆర్మూర్ ఎ.సి.పి వెంకటేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎస్.హెచ్.ఓ. సత్యనారాయణ గౌడ్, ఆర్మూర్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాహుల్ కుమార్, ఇతర పోలీస్ అధికారులు తదితరులు ఉన్నారు.






