ఐటీఐలో ఘనంగా జాబ్ మేళా
- యువత అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి
- కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురుచూడకుండా ప్రైవేట్ రంగంలో లభించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా యువతకు సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో జిల్లా ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాలో పలు ప్రముఖ బహుళజాతి సంస్థలు, స్థానిక పరిశ్రమల ప్రతినిధులు పాల్గొని అర్హులైన అభ్యర్థులకు నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించాయి.
ఉద్యోగ మేళాకు ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ... ప్రస్తుతం పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సాంకేతిక నైపుణ్యాలు కలిగిన యువతకు మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు తమ ప్రతిభను నిరూపించుకునేందుకు ఇలాంటి జాబ్ మేళాలు ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. జాబ్ మేళాలో వివిధ కంపెనీలు వేర్వేరు విభాగాల్లో ఉద్యోగాల కోసం అభ్యర్థులను ఎంపిక చేయగా, అభ్యర్థులకు కలెక్టర్ చేతుల మీదుగా నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి కల్పనాధికారిణి మిల్కా, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధ్యాపకులు, అధికారులు, యువతీ యువకులు పాల్గొన్నారు.






