18 August, 2026 | 2:45 AM

భోగాపురం నుంచి విమాన సర్వీసులు షురూ

18-08-2026 12:49 AM

అమరావతి, ఆగస్టు 17: ఆంధ్రప్రదేశ్‌లోని భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సోమవారం విమాన సర్వీసులు అధికారికంగా ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి బయలుదేరి తొలి ఇండిగో విమానం సోమవారం ఉదయం 6:45 గంటలకు భోగాపురం విమానాశ్రయానికి చేరుకుంది. దీంతో పాటు సింగపూర్‌కు వెళ్లేందుకు స్కూట్ ఎయిర్‌లైన్స్ విమానం కూడా తన సర్వీసులను ప్రారంభించింది.

కాగా హైదరాబాద్ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి జీఎంఆర్ ప్రతినిధులతో పాటు జిల్లా అధికారులు, ఎయిర్‌పోర్ట్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకొని ఎయిర్‌లైన్స్ సిబ్బంది ప్రయాణికులతో కలిసి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అంతేకాకుండా మొదటి ప్రయాణంలో పాల్గొన్న వారికి జ్ఞాపకార్థంగా ‘ ఫస్ట్ ఫ్లుటై సర్టిఫికెట్లు ఇవ్వడంతో పాటు ఏటికొప్పాక బొమ్మలను అందజేశారు. అలాగే ఉదయం 7.30 తర్వాత తొలి విమానం హైదరాబాద్ వెళ్లింది.

8 గంటలకు బెంగళూరుకు, 8.20కి ఢిల్లీకి, 8.50కి హైదరాబాద్ సర్వీసులు బయలుదేరతాయి. విశాఖపట్నం నుంచి భోగాపుం వచ్చేందుకు 20 విద్యుత్తు బస్సులను ఏర్పాటు చేశారు. విమానాశ్రయంలో తొలి వాణిజ్య విమాన సేవలను జెండా ఊపి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రారంభించారు.

ప్రయాణికులకు బోర్డింగ్ పాస్‌లను అందజేశారు.  హైదరాబాద్, తిరుపతి, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ముంబై నగరాలకు సర్వీసులు తిరగనున్నాయి. సోమవారం 31 సర్వీసులు రాకపోకలు సాగించనుండగా వీటి ద్వారా సుమారు మొదటి రోజు 6 నుంచి 7వేల మంది ప్రయాణించనున్నారు. ఇప్పటి వరకు చాలాఏళ్లుగా సేవలందించిన విశాఖ విమానాశ్రయం నుంచి చిట్టచివరి సర్వీసుగా ఢిల్లీ విమానం ఆదివారం రాత్రి 10.45 గంటలకు బయల్దేరింది. అనంతరం వాణిజ్యపరమైన సేవలు నిలిచిపోయాయి.