18 August, 2026 | 2:38 AM

కదంతొక్కిన గులాబీ దండు

18-08-2026 12:42 AM
  1. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు
  2. కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలు తొలగించొద్దని డిమాండ్

విజయక్రాంతి న్యూస్ నెట్వర్క్, ఆగస్టు 17: కల్యాణలక్ష్మి, షాది ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ శ్రేణులు కదం తొక్కాయి. అన్ని జిల్లా కేంద్రాలు, నియోజకవర్గ, మండల కేంద్రాల్లోని ఆర్డీవో, తహసీల్దార్ కార్యాలయాల ఎదుట భారీ ధర్నాలు, నిరసనలు చేపట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను నీరుగారుస్తోందని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఈ ఆందోళనలు నిర్వహించారు.

సెప్టెంబర్ 9న కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకంపై నమోదైన పిటీషన్ కు ప్రభుత్వం తరఫున అప్పిల్ చేయాలని, చేయని పక్షాన బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల, మంత్రుల, ముఖ్యమంత్రి ఇండ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మెదక్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తదితర నేతల నేతృత్వంలో బైఠాయించి నిరసన తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్‌ఎస్ నాయకులు  ఆందోళనలు నిర్వహించారు. మంచిర్యాల, నిర్మల్, కుమ్రంభీం ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్‌ల వద్ద, ఆయా మండలాల్లో తహశీల్దార్ కార్యాలయాల వద్ద ధర్నాలు నిర్వహించి నిరసన తెలిపారు.