18 August, 2026 | 1:16 AM

లక్షలు వెచ్చించినా నెరవేరని లక్ష్యం

18-08-2026 12:06 AM
  1.   10 లక్షలతో మరమ్మతులు చేయించినా.. వినియోగానికి దూరం
  2. అధికారుల నిర్లక్ష్యంతో మూతపడ్డ బీసీ బాలికల వసతి గృహం 
  3. ఇక్కడ పనిచేసే సిబ్బందిని మరోచోటికి బదిలీ 
  4. అధికారుల తీరుపై సర్వత్రా నిరసన 

గణపురం, ఆగస్టు 17 (విజయ క్రాంతి): ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక దృష్టి సారిస్తోందని చెబుతున్నప్పటికీ అది క్షేత్రస్థాయిలో మాత్రం అమలు కావడం లేదు. లక్షలు వెచ్చించి మరమ్మతులు చేసినప్పటికీ గణపురం మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహం మూతపడింది. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చే నిరుపేద విద్యార్థులకు బాలిక వసతి గృహం ఎంతో సౌకర్యంగా ఉండేది.

ఒకప్పుడు వందలాదిమంది బాలికలతో కలకలలాడిన వసతి గృహం నేడు తాళం వేయడంతో బోసిపోయి కనిపిస్తుంది. గత విద్యా సంవత్సరంలో వసతి గృహం భవనం శిలావస్థకు చేరుకోవడంతో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక చొరవతో 10 లక్షల నిధులు కేటాయించారు. మరమ్మతు పనులు కూడా పూర్తి చేశారు. విద్యుత్ సామాగ్రి ఏర్పాటు చేయడంతో పాటు భవనానికి రంగులు వేసి వాటర్ ట్యాంకులను కూడా ఏర్పాటు చేశారు.

అయినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుండి వసతి గృహం తెరవకపోవడంతో  కొంతమంది బాలికలు ఇక్కడి పాఠశాలల్లో  అడ్మిషన్లు క్యాన్సల్ చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్లిపోయారు. గతంలో మోడల్ పాఠశాలలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులు సమీపంలోనే ఉన్న బాలికల వసతి గృహంలో ఉండి తమ చదువు కొనసాగించేవారు.

ఈసారి వసతిగృహం మూతపడడంతో గత్యంతరం లేక విద్యార్థినిల తల్లిదండ్రులు వేరే ప్రాంతాల్లో హాస్టల్ వసతి ఉన్న పాఠశాలలో చేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 10 లక్షలు వెచ్చించి మరమ్మతులు చేసిన భవనాన్ని వాడుకలోకి తెచ్చి తిరిగి యధావిధిగా బాలికల వసతి గృహాన్ని కొనసాగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

బీసీ బాలికల వసతి గృహాన్ని తిరిగి ప్రారంభించాలి 

మండల కేంద్రంలోని బాలికల వసతి గృహం మూతపడడంతో పేద విద్యార్థినిలకు తీరని నష్టం జరిగింది. పలుమార్లు విద్యార్థి సంఘాలు అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతో సౌకర్యంగా ఉండే వసతి గృహం మూతపడడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బీసీ బాలికల వసతి గృహాన్ని తిరిగి కొనసాగించాలి.

- ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు కండే రవి