ఆటో డ్రైవర్ ఇంట్లో నోట్ల కట్టలు
- ఇన్‌స్టాలో తుపాకీ పట్టుకున్న ఫొటో
- అనుమానంతో పోలీసుల సోదా
- మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాలో వెలుగు చూసిన ఘటన
భోపాల్, ఆగస్టు 17: ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తుపాకీలు చేత పట్టుకుని ఫొటోలు పోస్ట్ చేశాడు. అవి కాస్తా నెట్టింట వైరల్ కాగా.. పోలీసుల కంట పడ్డాయి. దీంతో దర్యాప్తు ప్రారంభించగా ఎవరూ ఊహించని రీతిలో నోట్ల కట్టలు బయటపడడంతో ఒక్కసారిగా పోలీసులు షాక్‌కు గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చెందిన ఓ యూజర్.. సామాజిక మాధ్యమాల్లో తుపాకులు, కత్తులతో ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసే క్రిమినల్ నేపథ్యం ఉన్నవారి ప్రొఫైళ్లను పోలీసులు నిరంతరం పరిశీలిస్తున్నారు.
ఈ క్రమంలోనే ఆదివారం గోపాల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సౌరభ్ అహిర్వార్ అనే క్యాబ్ డ్రైవర్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పిస్టల్ పట్టుకున్న ఫొటోను పోలీసులు గుర్తించారు. ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడానికి పోలీసులు అతడి ఇంటికి వెళ్లి సోదా చేశారు. ఈక్రమంలోనే వారికి తాళం వేసిన ఓ బీరువా కనిపించగా.. దాన్ని తెరవాలని సౌరభ్ అహిర్వార్ కుటుంబ సభ్యులను కోరారు. అయితే వాళ్లు మాత్రం తమ వద్ద తాళం చెవి లేదని చెప్పగా పోలీసులు కొంతమంది సాక్షుల ఎదుట ఆ బీరువాను పగలగొట్టారు.
కానీ లోపల తుపాకీ కాకుండా నోట్లతో నిండిన సంచులు బయటపడ్డాయి. ముఖ్యంగా మూడు బ్యాగుల నిండుగా పెద్ద ఎత్తున నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో నోట్ల కట్టలు లెక్కింపు యంత్రం తెప్పించాల్సి వచ్చింది. సాగర్ ఎస్పీ అనురాగ్ సుజానియా అందించిన వివరాల ప్రకారం.. స్వాధీనం చేసుకున్న నగదు విలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని తెలిపారు. మొత్తం లెక్కింపు, స్వాధీన ప్రక్రియను వీడియో చిత్రీకరించారు.






