పేదవారి ఆత్మగౌరవం ఇందిరమ్మ ఇల్లు
- అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ఇల్లు వచ్చేలా చూస్తాం: అనిరుధ్ రెడ్డి
- జడ్చర్ల పట్టణంలో 17 ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే
జడ్చర్ల, ఏప్రిల్ 13: సొంత ఇల్లు పేదవారి ఆత్మగౌరవానికి నిదర్శనమని, అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లును మంజూరు చేయడమే తమ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని జడ్చర్ల ఎమ్మెల్యే శ్రీ జనంపల్లి అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలోని 17వ వార్డులో నూతనంగా నిర్మించిన 17 ఇందిరమ్మ ఇళ్లను సోమవారం ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్దిదారులందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వారి ఆనందాన్ని పంచుకున్నారు.
తమకు సొంతిల్లు వస్తుందని తాము కలలో కూడా అనుకోలేదని,అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి సమాజంలో తమ గౌరవాన్ని పెంచిందని ఈ సందర్భంగా ఇందిరమ్మ లబ్దిదారులు ఎమ్మెల్యే గారితో తమ భావోద్వేగాన్ని పంచుకున్నారు.
ఇందిరమ్మ మొదటి విడతలో జడ్చర్ల పట్టణానికి 550 ఇళ్లు మంజూరయ్యాయని, వాటి నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుకను కేటాయించడానికి, సకాలంలో బిల్లులు మంజూరు చేయించడానికి తాను చర్యలు తీసుకుంటున్నానని చెప్పారు.మలి విడతలో కూడా మరిన్ని ఇళ్లు రానున్నాయని తెలిపారు.అర్హత కలిగిన ప్రతి పేదవాడికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేలా చూస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.17 వ వార్డులో ఒకేసారి 17 ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడం సంతోషదాయకమని,మలి విడతలో ఈ వార్డుకు ఎన్ని అవసరమైతే అన్ని ఇళ్లు మంజూరయ్యేలా చూస్తామని అనిరుధ్ రెడ్డి ప్రకటించారు.






