5 July, 2026 | 7:06 PM

పుష్కరాల నాటికి ఆలయాలకు ప్రత్యేక శోభ..!

05-07-2026 05:59 PM

రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ధర్మపురి,(విజయక్రాంతి): గోదావరి పుష్కరాలకు ముందే గోదావరి తీరంలోని ఆలయాలకు కొత్త శోభ తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం కోటిలింగాల గ్రామంలోని శ్రీ కోటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గోదావరి పుష్కరాలకు ఏడాది ముందుగానే ఏర్పాట్లు చేయడానికి బడ్జెట్ లో నిధులు కేటాయించారని మంత్రి అన్నారు.

గోదావరి తీరం వెంట బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర అభివృద్ధికి నిధులు కేటాయించడంతో పాటు కోటిలింగాలలోని కోటేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు కేటాయించినట్లు మంత్రి వివరించారు.

ధర్మపురి నియోజకవర్గానికి పుష్కర పనుల కోసం రూ.117 కోట్లు కేటాయించగా ఇందులో కోటిలింగాలలో పుష్కర ఘాట్ నిర్మాణానికి రూపాయలు 8 కోట్లు కోటిలింగాల నుండి పాశీగాం వరకు రోడ్డు నిర్మాణానికి రూ. 8 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.వెల్గటూర్ నుండి కోటిలింగాల వరకు నాలుగు లైన్ల రహదారి విస్తరణ కొరకు రూ. 20 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు.కోటిలింగాలతో పాటు రాజక్కపల్లి వద్ద మిని ట్యాంక్ బండ్ మాదిరిగా నిర్మాణం చేస్తామని  మంత్రి తెలిపారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి తెలిపారు.

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కు అందజేత..

కోటిలింగాల గ్రామానికి చెందిన మంచి కట్ల మణితేజ ఇటీవల కుక్క కాటుకు గురై మరణించగా ప్రభుత్వం నుంచి మంజూరైన రూ.5లక్షల చెక్కును మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఈ సందర్భంగా మణితేజ కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు.

గృహప్రవేశంలో పాల్గొన్న మంత్రి అడ్లూరి..

వెల్గటూర్ మండల కేంద్రంలో ప్రభుత్వం మంజూరు చేసిన సింగం రాజేశ్వరి - తిరుపతి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షులు తాటిపర్తి శైలందర్ రెడ్డి, ఆలయ కమిటీ చైర్మెన్ పూదరి రమేష్, వెల్గటూర్ మాజీ సర్పంచ్ మేరుగు మురళి గౌడ్, సీనియర్ నాయకులు మేరుగు నరేష్ గౌడ్, గండ్ర శ్రీకాంత్ రావు, గుండాటి సందీప్ రెడ్డి,గుమ్ముల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.