19 August, 2026 | 4:01 PM

ప్రజల సమస్యల పరిష్కారమే ప్రథమ ప్రాధాన్యత

19-08-2026 02:26 PM

బీరంగూడ సాయికృపా కాలనీలో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి పర్యటన

అసంపూర్తి కల్వర్టు పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం

నూతన సీసీ రోడ్లు, యూజీడీల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచన

అమీన్ పూర్: ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకొని, వాటికి శాశ్వత పరిష్కారం చూపడమే తన ప్రధాన లక్ష్యమని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్ పూర్ సర్కిల్ పరిధిలోని బీరంగూడ సాయికృపా కాలనీలో బుధవారం ఉదయం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో నేరుగా సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించారు. 

కాలనీలో నిర్మాణంలో ఉన్న కల్వర్టు పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఎమ్మెల్యేకు వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే జిఎంఆర్.. కల్వర్టు నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పెరుగుతున్న జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కాలనీలో నూతన సీసీ రోడ్లు, యూజీడీ వ్యవస్థల నిర్మాణానికి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

కాలనీలో చేపట్టిన కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను సైతం త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటించాలని, స్థానిక సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.