పంచాయతీ కార్మికులను పర్మినెంట్ చేయాలని ఎంపీడీఓకు వినతిపత్రం
దమ్మపేట, (విజయక్రాంతి): బుధవారం సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికులను ఎన్నికల హామీ మేరకు పర్మినెంట్ చేయాలని, వారి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపిడివో రవీందర్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ మాట్లాడుతూ... సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని, మల్టీ పర్పస్ అనే ముద్దు పేరు పెట్టీ గ్రామ పంచాయతీ కార్మికులను కట్టు బానిసలుగా చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నెల నెలా వేతనాలు నేరుగా గ్రామ పంచాయతీ వర్కర్స్ ఖాతాలో వేయాలని, రాజకీయ వేధింపులు ఆపాలని, జీవో నెంబర్ 51 ను సవరించాలని, అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలన్నారు. గ్రామ పంచాయతీ వర్కర్స్ కు రెండవ పీఆర్సీ వర్తింప చేయాలని, ఆదివారం సెలవులు, పండుగ రోజున సెలవలు ఇవ్వాలని, రెండు జతల బట్టలు, చెప్పులు, కొబ్బరి నూనె ఇవ్వాలని డిమాండ్ చేశారు.






