రుణం ఇచ్చేందుకు బ్యాంకులే రైతు వద్దకు వెళ్లాలి: భట్టి విక్రమార్క
'తెలంగాణ రైజింగ్ 2047 బ్యాంకింగ్ రోడ్‌మ్యాప్' అవసరం
హైదరాబాద్: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో(Mahatma Jyotirao Phule Praja Bhavan) ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా 50వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం జరిగింది. తెలంగాణను 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే లక్ష్యంలో బ్యాంకింగ్, ఆర్థిక రంగాలు కీలక భాగస్వాములుగా మారాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.
రైతు రుణం కోసం బ్యాంకు చుట్టూ తిరగకుండా బ్యాంకులే రైతుల వద్దకు వెళ్లాలని, ప్రతి రైతుకూ సకాలంలో రుణం అందించడంతో పాటు రైతు ఆదాయం పెరిగేలా రుణ విధానాలు ఉండాలని ఆదేశించారు. వ్యవసాయం, MSMEలు, స్టార్టప్‌లు, మహిళా పారిశ్రామికవేత్తలు, గ్రామీణ పరిశ్రమలు, యువత ఉపాధి, గ్రీన్–క్లైమేట్ ఫైనాన్స్, డిజిటల్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ వంటి రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ‘తెలంగాణ రైజింగ్ 2047 బ్యాంకింగ్ రోడ్‌మ్యాప్’ రూపొందించాలని పేర్కొన్నారు. క్యూర్, ప్యూర్, రేర్ ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక బ్యాంకింగ్ వ్యూహాలను రూపొందించి, తెలంగాణ అభివృద్ధిలో బ్యాంకింగ్ రంగం బలమైన భాగస్వామిగా నిలవాలని ఉప ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.






