ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు పక్కదారి పడితే కఠిన చర్యలు
అత్యాచార ఘటనల్లో బాధితులకు అండగా నిలవాలి
రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య
భూపాలపల్లి, ఆగస్టు 19 (విజయక్రాంతి): ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కింద మంజూరైన నిధులను వారి ఆవాసాలు, సంక్షేమానికి ఖర్చు చేయకుండా పక్కదారి మళ్లిస్తే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య హెచ్చరించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్‌తో కలిసి వివిధ శాఖల అధికారులతో ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలు, ఆర్‌ఓఆర్, పదోన్నతులు, ఉప ప్రణాళిక నిధుల వినియోగం, సంక్షేమ పథకాలు, హక్కుల పరిరక్షణ, అత్యాచార నిరోధక చట్టం కేసుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా అధికారులు బాధ్యతగా పనిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రోస్టర్ రిజర్వేషన్లను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అత్యాచార ఘటనల్లో బాధితులకు పరిహారంతో పాటు ఉపాధి, గృహ వసతి, పునరావాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవాన్ని సమర్థవంతంగా నిర్వహించి, తహశీల్దార్లు, ఎస్‌ఐలు, సంబంధిత అధికారులు పాల్గొనాలని సూచించారు. గ్రామాల్లో భూ వివాదాలు, నేరాల నియంత్రణకు అవసరమైన ప్రాంతాల్లో పంచాయతీ లేదా సీఎస్‌ఆర్ నిధులతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులను పెండింగ్‌లో ఉంచకుండా సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ బాధితులకు కమిషన్ సూచించిన విధంగా ఇళ్ల కేటాయింపునకు చర్యలు తీసుకుంటామని, ప్రతి నెలా పౌర హక్కుల దినోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఎస్పీ సంకీర్త్ మాట్లాడుతూ అత్యాచారం తదితర ఘటనలపై తక్షణమే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. కమిషన్ సభ్యులు కుసురం నీలాదేవి, రాంబాబు నాయక్, కొంకటి లక్ష్మి నారాయణ, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, అదనపు ఎస్పీ నరేష్ కుమార్, డీఆర్వో వసంత కుమారి, ఎస్సీ అభివృద్ధి అధికారి సుకీర్తి జై భీం, ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, డీఎస్పీలు సూర్య నారాయణ, సంపత్ రావు, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహశీల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ శాఖల అధికారులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.






