19 August, 2026 | 4:26 PM

గురుకులాల్లో మెనూ పాటించకపోతే చర్యలు తప్పవు

19-08-2026 03:36 PM

- రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి

కల్వకుర్తి: గురుకుల విద్యాలయాల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను అమలు చేయకుండా విద్యార్థులకు నాణ్యమైన ఆహారం ఎలా అందిస్తారని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో అంగన్‌వాడీ కేంద్రాలు, గురుకుల విద్యాలయాలు, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను కమిటీ సభ్యులు శారద,  ఆనంద్ లతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా ఒక్కో విద్యాలయంలో ఒక్కో రీతిలో విద్యార్థులకు భోజనం అందించడం, నాసిరకం కూరగాయలను వినియోగించడంపై సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించకుండా విద్యార్థుల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే సహించేది లేదని, పరిస్థితుల్లో మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

విద్యార్థులకు ప్రతిరోజూ నాణ్యమైన భోజనం అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా మెనూను రూపొందించిందని, అయినప్పటికీ దానిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు గుడ్లు, మాంసం వంటి పోషకాహార పదార్థాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ, వాటిని విద్యార్థులకు సక్రమంగా అందించకుండా కొందరు లాభాలు పొందుతున్నారని ఆరోపించారు.

అనేకమంది చిన్నారులు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని, ఉపాధ్యాయులను నమ్మి తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తే వారికి సరైన ఆహారం అందించకపోవడం దారుణమన్నారు. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పాఠశాలలు, గురుకులాల్లో నిర్వహించిన తనిఖీలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అందజేస్తామని, నివేదిక ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేస్తామని  తెలిపారు.