19 August, 2026 | 3:04 PM

హెచ్‌సీఏ వన్డే టోర్నీకి చాణిక్య ఎంపిక

19-08-2026 02:23 PM

కోదాడ,(విజయక్రాంతి): హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించే సి-డివిజన్‌ వన్డే లీగ్‌ కమ్‌ నాకౌట్‌ టోర్నీకి ఉమ్మడి నల్లగొండ జిల్లా జట్టులో కోదాడ క్రికెట్‌ అకాడమీ క్రీడాకారుడు గొర్రె చాణిక్య ఎంపికయ్యాడు. ప్రతిభ, క్రమశిక్షణ, ఆటతీరుతో చాణిక్య జిల్లా జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సందర్భంగా కోదాడ క్రికెట్‌ అకాడమీ కోచ్‌ షేక్‌ సిద్ధిఖ్‌ చాణిక్యను అభినందించారు. చిన్న వయసు నుంచే క్రికెట్‌పై ఆసక్తితో కఠోర సాధన చేస్తున్న చాణిక్యకు జిల్లా జట్టులో అవకాశం రావడం సంతోషకరమన్నారు.

ఈ ఎంపికతో కోదాడ క్రికెట్‌ అకాడమీకి, పట్టణానికి మంచి పేరు వచ్చిందని తెలిపారు. రాబోయే పోటీల్లో చాణిక్య తన ప్రతిభను చాటుకుని మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. చాణిక్య ఎంపిక పట్ల కోదాడ క్రికెట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు, అకాడమీ క్రీడాకారులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.