6 May, 2026 | 2:49 AM

తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ప్రణాళిక

06-05-2026 01:31 AM

జలమండలి అధికారులతో ఎమ్మెల్యే జీఎంఆర్ సమీక్ష

పటాన్‌చెరు, మే 5 : ప్రస్తుత వేసవి కాలంలో కాలనీలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షించాలని జలమండలి అధికారులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంప్ కార్యాలయంలో అమీన్పూర్ సర్కిల్, పటాన్చెరు సర్కిల్ జలమండలి అధికారులతో తాగునీటి పంపిణీపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఇంటికి ఆటంకాలు లేకుండా తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు. సరిపడ నీరు అందించలేని పక్షంలో.. నూతన బోర్లు వేయడంతో పాటు.. ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని ఆదేశించారు. నూతన కాలనీలకు సైతం మంచినీటి సరఫరా అందించేందుకు పైపులైన్ల నిర్మాణం చేపట్టాలని సూచించారు. ఇప్పటికే ఈ అంశంపై జలమండలి అండి అశోక్ రెడ్డితో సైతం చర్చించడం జరిగిందని గుర్తు చేశారు.

నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సరఫరా తీరుపై సమీక్షించాలని కోరారు. మంచినీటి పంపిణీ పై ప్రజల నుండి ఫిర్యాదులు తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రధానంగా నీటి కొరత ఉన్న ప్రాంతాలను గుర్తించి, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని తెలిపారు. పాడైన బోర్లు, పైపులైన్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు అధికారులు స్పందిస్తూ..ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. అవసరమైన చోట కొత్త బోర్లు త్రవ్వడం, నిల్వ ట్యాంకుల శుభ్రపరిచే పనులు చేపడుతున్నామని వివరించారు. ఈ సమావేశంలో జలమండలి డీజీఎం లు శివకుమార్, శ్రీనివాసరావు, మేనేజర్లు ప్రవీణ్, శ్రీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.