26 May, 2026 | 1:56 AM

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి

26-05-2026 12:45 AM

యాతాలకుంట టన్నెల్ పనులను పరిశీలించిన మంత్రి తుమ్మల

సత్తుపల్లి, మే 25 (విజయక్రాంతి):  జిల్లా సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట వద్ద కొనసాగుతున్న టన్నెల్ నిర్మాణ పనులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా టన్నెల్ నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాలు, పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి అయ్యేలా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు యాతాలకుంట ప్రాంతంలో జరుగుతున్న ఈ టన్నెల్ నిర్మాణం పూర్తయితే పరిసర ప్రాంతాల్లో సాగునీటి సదుపాయాలు మెరుగుపడటంతో పాటు రైతులకు ఎంతో మేలు జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో నీటి వనరుల అభివృద్ధి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

రైతుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం భారీ స్థాయిలో సాగునీటి ప్రాజెక్టులను అమలు చేస్తోందని చెప్పారు పనుల పరిశీలన సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అక్కడి ఇంజినీరింగ్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రజాధనం వృథా కాకుండా ప్రతి రూపాయి ప్రజలకు ఉపయోగపడేలా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.

టన్నెల్ పనుల్లో ఉపయోగిస్తున్న సామగ్రి నాణ్యతను పరిశీలించి, అవసరమైన చోట ఆధునిక సాంకేతిక పద్ధతులను వినియోగించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జారే ఆదినారాయణ పాల్గొని ప్రాంత ప్రజల సమస్యలు సాగునీటి అవసరాలు అభివృద్ధి పనుల ప్రాధాన్యతపై మంత్రికి వివరించారు. అశ్వారావుపేట నియోజకవర్గ ప్రజలకు సాగునీరు, రహదారులు మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రజలు సానుకూలంగా స్వాగతిస్తున్నారని తెలిపారు జిల్లా అధికారులు మంత్రి పర్యటన సందర్భంగా టన్నెల్ నిర్మాణ పనుల వివరాలను సమగ్రంగా వివరించారు.

ఇప్పటివరకు పూర్తయిన పనులు మిగిలిన దశలు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు తదితర అంశాలపై నివేదిక సమర్పించారు. పనులు త్వరగా పూర్తయ్యేలా అదనపు యంత్రాంగాన్ని వినియోగిస్తున్నామని అధికారులు తెలిపారు. పర్యటన సందర్భంగా స్థానిక ప్రజలు రైతులు మంత్రిని కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు ఇరిగేషన్ శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. యాతాలకుంట టన్నెల్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.