వేగంగా హుస్నాబాద్ అభివృద్ధి
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, మే 2 (విజయక్రాంతి): హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిలో వేగం పెంచామని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో శనివారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో మంత్రి పొన్నం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించి, నియోజకవర్గ అభివృద్ధిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్ల ఐదు నెలల కాలంలో హుస్నాబాద్ నియోజకవర్గంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
రైతుభరోసా కింద రూ.265 కోట్లు 2.56 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు చెప్పారు. రైతుబీమా ద్వారా 679 మంది కుటుంబాలకు దాదాపు రూ.50 కోట్ల సహా యం అందించామని వివరించారు. కొత్తపల్లి నాలుగు లైన్ల రహదారి నిర్మాణం కొనసాగుతుండగా, హుస్నాబాద్ రహదారికి టెండర్లు పిలిచినట్లు తెలిపారు. గౌరవెల్లి ప్రాజెక్టు పనులు పూర్తి చేసి భూ నిర్వాసితులకు చెల్లింపులు చేయడం తన బాధ్యతన్నారు.
హుస్నాబాద్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయడంతో పాటు అర్బన్ పార్క్, చెరువుల అభివృద్ధి చేపడుతున్నామని తెలిపారు. ప్రజల సహకారంతో హుస్నాబాద్‌ను క్లీన్ అండ్ గ్రీన్‌గా తీర్చిదిద్దాలని, మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో సమగ్రాభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హైమావతి, పోలీస్ కమిషనర్ సాధన రష్మీ పెరుమాళ్, మున్సిపల్ చైర్మన్ లక్ష్మీ, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.






