కేసీఆర్ మీద కక్ష్య.. రైతన్నలకు శిక్ష తగునా?
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్స్ వేదికగా మరోసారి ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద వృథాగా లక్షల క్యూసెక్కులు పోతున్నాయని కేటీఆర్ ఆరోపించారు. నీళ్లు లేక పల్లెల్లో రైతన్నలు కన్నీళ్లు పెడుతున్నారని వాపోయారు. నీళ్లు లేక రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. నీటిని వృథా చేస్తారా? అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించి.. కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) తమాషా చూస్తోందని కేటీఆర్ ధ్వజమెత్తారు.
అన్నదాత అల్లాడుతుంటే ప్రభుత్వానికి పాపం అనిపించట్లేదా?, గోదావరి జలాలను ఎత్తిపోసి, రైతు గోస తీర్చాలనే సోయి లేదా?, కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) మీద కక్షతో రైతన్నలకు శిక్ష వేయడం తగునా?, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) రైతు ముఖ్యమా? రాజకీయం ముఖ్యమా? అని వరస ప్రశ్నలు సంధించారు. మీ పగ ప్రతిపక్షం మీద తీర్చుకోండన్న కేటీఆర్ రైతన్నలను ఆగం చేయకండని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.






