12 May, 2026 | 4:38 PM

NEET-UG 2026 cancelled: కేంద్రంపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం

12-05-2026 03:49 PM

నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ, పరీక్ష రద్దుపై మంత్రి పొన్నం ఆందోళన

నీట్ పరీక్షను నిర్వహించడంలో కేంద్రం విఫపం

హైదరాబాద్: భారత ప్రభుత్వ ఆమోదంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing Agency) 2026 మే 3వ తేదీన నిర్వహించిన NEET (UG) 2026 పరీక్షను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం  నిర్ణయించింది. దేశవ్యాప్తంగా దాదాపు 22 లక్షల మంది విద్యార్థులు హాజరైన నీట్ (NEET) పరీక్ష నిర్వహణలో జరిగిన ప్రశ్నాపత్రాల లీకేజీ  అత్యంత ఆందోళనకరమని తెలంగాణ రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి  పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోనే సుమారు 71 వేల మంది విద్యార్థులు ఎంతో కష్టపడి, భవిష్యత్తుపై ఆశలు పెట్టుకుని నీట్ పరీక్ష రాశారని, అలాంటి కీలక పరీక్షలో అవకతవకలు చోటుచేసుకోవడం విద్యార్థులు, తల్లిదండ్రుల నమ్మకాన్ని దెబ్బతీసిందని మండిపడ్డారు.

కేంద్రంలో, రాజస్థాన్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాల(BJP governments) వైఫల్యాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న పరీక్షలను సక్రమంగా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం కేంద్రంలో ఉండటం దురదృష్టకరమన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును కాపాడడంలో, పారదర్శకమైన పరీక్షా వ్యవస్థను నిర్వహించడంలో పూర్తిగా విఫలమైందని మంత్రి పొన్నం ప్రభాకర్ ద్వజమెత్తారు.

ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు(NEET Question Paper Leaked) దేశ విద్యా వ్యవస్థ పరువును దిగజార్చాయని, ఈ పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. ఈ సంక్షోభానికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వమే వహించాలని మంత్రి పొన్నం డిమాండ్ చేశారు. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షలు(NEET Exams) రాసిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రశ్నాపత్రం లీక్ వల్ల నీట్ యూజీ-2026 పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నెల 3న జరిగిన నీట్ యూజీ పరీక్ష రద్దు చేయాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ పై కేంద్రం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.