అమిత్ షా x రాహుల్!
ఆజ్ ఆఖ్రీ దిన్
- విద్యార్థులపై లాఠీచార్జికి చర్చకు సిద్ధమన్న కేంద్ర హోంమంత్రి
- అవసరమైతే 24 గంటలు సభలో చర్చిద్దామని విపక్షాలకు సవాల్
- లాఠీచార్జిపై సూటిగా సమాధానం కావాలన్న రాహుల్
- కాల్పులకు ఆదేశాలిచ్చింది ఎవరో చెప్పాలని డిమాండ్
న్యూఢిల్లీ, ఆగస్టు 12 : నీట్ పేపర్ లీక్, ఢిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా చోటు చేసుకున్న ఘటనలు, లాఠీచార్జి అంశాలు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను మరింత వేడెక్కించాయి. ప్రతిరోజు విపక్ష సభ్యులు ఈ అంశాలపై ఆందోళనలు చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా సభకు వచ్చి సమాధానం చెప్పాలని పట్టుబడుతు న్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన అమిత్ షా.. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.
అవసరమైతే 24 గంటల పాటు సభను నిర్వహించి ప్రతి అంశంపైనా చర్చిద్దామని, విపక్ష సభ్యులు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు తానే సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు. అయితే అమిత్‌షా ప్రతిపాదనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు. తమకు హోంమంత్రి లెక్చర్లు అవసరం లేద ని, విద్యార్థులపై కాల్పులు, లాఠీచార్జికి ఆదేశాలిచ్చింది ఎవరో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.
అమిత్‌షా సవాల్..
ఢిల్లీ ఘటనలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చకు సిద్ధమని స్పష్టం చేసిన అమిత్‌షా .. ప్రతిపక్షాలకు 24 గంటల చర్చకు సవాల్ విసిరారు. ప్రతిపక్షాలు బుధవారం మధ్యా హ్నం 2 గంటలలోపు స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని సూచించారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి మరుసటి రోజు మధ్యా హ్నం 3 గంటల వరకు 24 గంటలపాటు చర్చ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. చర్చలో స్వయంగా పాల్గొంటానని, విపక్ష సభ్యుల ప్రతి ప్రశ్నకు పాయింట్ల వారీగా సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.
దాచడానికి ఏమీ లేదు..
నీట్ పేపర్ లీక్, విద్యార్థుల ఆందోళనల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి దాచాల్సిందేమీ లేదని అమిత్‌షా అన్నారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభు త్వం చర్చకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. అయితే పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకోవడం ద్వారా ప్రజా సమస్య లపై చర్చకు అవకాశం లేకుండా చేయడం సరికాదని విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తీవ్రమైన అంశాలను సభలో కేవలం ఒక ప్రకటనతో ముగించలేమని అమిత్‌షా స్పష్టం చేశారు.
పార్లమెంటులో చర్చకు నిర్దిష్టమైన నియమ నిబంధనలు ఉన్నాయని, వాటి ప్రకారమే సమగ్ర చర్చ జరగాలని అన్నారు. అవసరమైతే స్పీకర్ అనుమతితో ప్రశ్నోత్తరాల సమయాన్ని వాయిదా వేసి చర్చ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. సభలో ప్రకటన చేసి వెళ్లిపోవడం పార్లమెంటరీ విధానం కాదని, సభ్యులు లేవనెత్తే అంశాలపై పూర్తిస్థాయిలో చర్చ జరగాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రతి రోజూ పార్లమెంట్‌కు వస్తున్నా..
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా సభకు హాజరవుతున్నానని అమిత్‌షా చెప్పా రు. ‘కనిపించడం లేదు’, ‘పారిపోయారు’ వంటి వ్యాఖ్యలు పార్లమెంటరీ చర్చల్లో వినిపిస్తున్నాయని ప్రస్తావించారు. తాను తన ఛాం బర్‌లోనే ఉంటున్నానని, ఉభయ సభలను విపక్షాలు సాగనివ్వకుండా చేస్తే సభకు వచ్చి ఏం చేయగలనని ప్రశ్నించారు. హంగామా చేయడం మానేసి చర్చకు రావాలని, నిర్ణ యం వారి చేతుల్లోనే ఉందని, అర్థవంతమై న చర్చ కావాలా.. సభలో రచ్చ కొనసాగించాలా విపక్షాలే తేల్చుకోవాలని అన్నారు.
మాకు లెక్చర్లు వద్దు : రాహుల్
హోంమంత్రి లోక్‌సభలో ఇచ్చే ఉపన్యాసాలు వినేందుకు విపక్షాలు, దేశ యువత సిద్ధంగా లేదని రాహుల్‌గాంధీ అన్నారు. తమకు లెక్చర్లు అవసరం లేదని, విద్యార్థులపై జరిగిన చర్యలకు సంబంధించిన ప్రశ్న లకు స్పష్టమైన సమాధానాలు మాత్రమే కావాలని తేల్చిచెప్పారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కాల్పులు జరపాలని ఎవరు ఆదేశించారో హోం మం త్రి చెప్పాలని డిమాండ్ చేశారు.
‘మేకులున్న లాఠీలతో కొట్టేందుకు ఆదేశాలు ఎవరి చ్చా రో వెల్లడించాలన్నారు. ఆదేశాలు ఆయనే ఇచ్చి ఉంటే వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి. ఒకవేళ ఆయనకు తెలియకుండానే ఈ ఘోరం జరిగి ఉంటే ఆయన ఈ పదవికి పనికిరారు. హోంమంత్రికి సభకు వచ్చి మ మ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేదు. నిజం చెప్పే సాహసం లేకనే దాక్కుంటున్నారు.
ఆయన మౌనమే ఆయన నేరాన్ని అంగీకరించినట్లు స్పష్టం చేస్తోంది. సభలో ఊహాజనిత కబుర్లు చెప్పడం మాకు అవసరం లేదు. కాల్పులకు బాధ్యులెవరో స్పష్టంగా తేల్చాలి. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ఇద్దరికీ నిజాలను ఎదుర్కొనే గుండెధైర్యం లేదు’ అని రాహుల్ విమర్శించారు. ఇదిలా ఉండగా సాధారణ చర్చతో సమస్యను పక్కదారి పట్టించవద్దని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి.






