13 August, 2026 | 4:27 AM

‘సంతాన’ దగా

13-08-2026 02:06 AM
  1. కొత్తపేట జెన్ సిస్ దవాఖాన ఘటనతో వెలుగులోకి.. 
  2. రూ.లక్షలు గుంజి ప్రాణాలమీదికి తెచ్చారని బాధితుల ఆగ్రహం
  3. జిల్లాలో 60 కి పైగా క్లినిక్ లు 
  4. నిబంధనలకు నీళ్లు 
  5. పట్టించుకోని అధికారులు

ఎల్బీనగర్, ఆగస్టు 11 (విజయక్రాంతి): వై ద్యం పూర్తిగా ఖరీదైపోయింది. ప్రభుత్వ అధికారుల పర్యవేక్షణ లోపించడంతో వైద్యాన్ని పక్కా వ్యాపారంగా మార్చేసి కొన్ని కార్పొరే ట్, ప్రైవేటు ఆసుపత్రులు ప్రజలను యథేచ్ఛగా దోచుకుంటున్నాయి. పిల్లలు లేరని ఆ శగా వచ్చిన దంపతులకు నకిలీ ఆశలు చూ పి, లక్షల రూపాయలు వసూలు చేయడమే కాకుండా తీరని శోకాన్ని మిగిల్చిన ఘటన కొత్తపేటలోని ‘జెన్ సిస్’ సంతాన సాఫల్య కేంద్రంలో వెలుగు చూసింది.

లక్షలు వసూలు.. చివరికి మాతృత్వానికి దూరం!

నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం బోటిమీది తండా గ్రామానికి చెందిన నేనావత్ గీత (32), నేనావత్ జయపాల్ నాయక్ (41) భార్యాభర్తలు. వీరికి సంతానం లేకపోవడంతో గతేడాది 2025 మే నెల నుండి కొత్తపేట మెట్రో స్టేషన్ సమీపంలోని ‘జెన్ సిస్’ సంతాన సాఫల్య కేంద్రం వైద్యురాలు ఆర్. నర్మదా వేణుగోపాల్ను సంప్రదించారు. ఐవీఎఫ్ పద్ధతిలో సంతాన భాగ్యం కలిగిస్తామని చెప్పి సదరు వైద్యురాలు బాధితుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేశారు.

అన్ని పరీక్షలు నిర్వహించిన డాక్టర్ నర్మద.. గర్భంలో శిశువు ఆరోగ్యంగానే పెరుగుతోందని నమ్మబలికారు. తీరా బాధితురాలు గీత అనారోగ్యానికి గురికావడంతో గర్భంలోని శిశువు మృతి చెందిందని, వైద్యుల సూచన మేరకు అబార్షన్ చేయించాల్సి వచ్చింది. దీంతో బాధితులు తమకు న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

రంగారెడ్డిలో యథేచ్ఛగా ‘సంతాన’ దందా!

ఈ ఒక్క ఘటనతో రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న ఫెర్టిలిటీ సెంటర్ల దందా మళ్లీ తెరపైకి వచ్చింది. పసిపాప శబ్దం కోసం తపించే అమాయక దంపతుల ఆవేదనను కొందరు కేటుగాళ్లు పక్కా వ్యాపార నమూనాగా మార్చుకున్నారు. 60కి పైగా క్లినిక్లు.. సగానికి పైగా నిబంధనలకు నీళ్లు వదిలేయ్ అనే ఆరోపణలు వెళ్ళు వెతుతున్నాయి. జిల్లా లో ఎల్బీనగర్, కొత్తపేట, దిల్సుఖ్నగర్, సరూర్ నగర్, షాద్నగర్, రాజేంద్రనగర్ పరిసర ప్రాంతాల్లో సుమారు 60కి పైగా ఫెర్టిలిటీ క్లినిక్లు కొనసాగుతున్నాయి. కేవలం ఒకరిద్దరు సాధారణ డాక్టర్లతో నడిచే చిన్న క్లినిక్ల నుంచి కార్పొరేట్ దవాఖానల వరకు యథేచ్ఛగా ఐవీఎఫ్ చికిత్సల పేరుతో బోర్డులు వెలిశాయి.

అమలు కానీ ఏఆర్టీ చట్టం!

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నేషనల్ ఏఆర్టీ అండ్ సుర్రోగాసీ యాక్ట్’ ప్రకారం ప్రతి ఫెర్టిలిటీ క్లినిక్, ఎగ్ బ్యాంక్ తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద రిజిస్ట్రేషన్ కాబడాలి. కానీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పర్యవేక్షణ పూర్తిగా కరువవ్వడంతో, క్లినిక్లు ఎలాంటి తనిఖీలు లేకుండానే కోట్ల వ్యాపారాన్ని సాగిస్తున్నాయి.

దోపిడీకి మాస్టర్ ప్లాన్..

పిల్లలు కోసం వచ్చే బాధితులతో మొదట  తక్కువ ప్యాకేజీలతో ఆకర్షించడం, ఆ తర్వాత హార్మోన్ ఇంజెక్షన్లు, ’స్పెషల్ ఎగ్ క్వాలిటీ’, ఎంకరేజింగ్ టెస్ట్ల పేరుతో రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు బాదేస్తున్నారు. ఫెర్టిలిటీ స్పెషలైజేషన్ లేని సాధారణ గైనకాలజిస్టులతో ఎంభ్రియో ట్రాన్స్ఫర్ వంటి అత్యంత సున్నితమైన ప్రక్రియలు నిర్వహించడంతో మహిళలు గర్భస్రావాల పాలవుతున్నారు.

సరోగసీ ఏజెంట్లు.. అండాల విక్రయ దందా...

గతంలో దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్ పరిసరాల్లో వెలుగుచూసినట్లే.. పేద మహిళలను లోబరుచుకుని అక్రమంగా అండాలు  సేకరించడం, నిబంధనలకు విరుద్ధంగా సరోగసీ (సరోగేట్ మదర్స్) దందాను రన్ చేయడంపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయి.జెన్ సిస్ దవాఖానపై విచారణ జరిపి సదరు డాక్ట్ప క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న ఫెర్టిలిటీ క్లినిక్లను అధికారులు తనిఖీ చేసి అనధికార సెంటర్ల లైసెన్సులను రద్దు చేయాలని బాధితులు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఫెర్టిలిటీ క్లిన్పి కఠిన చర్యలు..

జిల్లాలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న  క్లినిక్ ల పై ప్రత్యేక నిఘా పెడుతున్నాం. ‘జెనిసిస్ ఫెర్టిలిటీ క్లినిక్ ఘటన వివరాలను సేకరిస్తున్నాం. ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా వ్యహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిణి స్వర్ణకుమారి స్పష్టం చేశారు. స్వయంగా క్లినిక్ను సందర్శించి విచారణ అనంతరం కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.