బీఆర్ఎస్ కంటే ఎక్కువ ఇండ్లు కడితేనే.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా
- హైదరాబాద్ లో లక్ష ఇళ్లు..
- ఒక్క రూపాయి ఫీజు లేకుండా... మహిళల పేరుమీద ఇళ్ల రిజిస్ట్రేషన్
- బీఆర్ఎస్ హయాంలో గృహనిర్మాణ శాఖ నిర్వీర్యం
- రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ..
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతుందని, ఇప్పటికే సుమారు లక్షకుపైగా ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్(Minister Ponguleti Srinivas Reddy) సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తెలిపారు. జూన్ చివరికి మరో లక్ష ఇళ్లు పూర్తవుతాయని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో స్థలం కొరత వల్ల 18 వేల ఇళ్లు మంజూరు చేశామని పేర్కొన్నారు.
పట్టణానికి 30 కిలో మీటర్ల దూరంలో గత ప్రభుత్వం పేదలకు ఇళ్లు నిర్మించిందని మంత్రి తెలిపారు. పట్టణాలకు దూరంగా ఇళ్లు నిర్మించడంతో పేదలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. తొలిదశలో హైదరాబాద్ లో లక్ష ఇళ్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. లక్ష ఇళ్లు ఇచ్చేందుకు అవసరమైన కార్యాచరణ కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లామని వివరించారు. లక్ష ఇళ్లు ఇచ్చేందుకు సుమారు 13 ప్రాంతాల్లో స్థలాలు పరిశీలించామని చెప్పారు. నివాస యోగ్యమైన ప్రదేశంలో పేదల ఇళ్లు నిర్మిస్తామని సూచించారు.
పేదల జీవనోపాధికి అనుగుణంగా ఉండే ప్రాంతాల్లో ఇళ్లు నిర్మిస్తామని మంత్రి స్పష్టం చేశారు. పేదల ఇళ్ల కోసం విలువైన ప్రభుత్వ భూములు కేటాయిస్తున్నామని వివరించారు. పేదల సూచనలు, ఆలోచనలకు అనుగుణంగానే ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఒక్క రపాయి ఫీజు తీసుకోకుండా మహిళల పేరు మీదుగా రిజిస్ట్రేషన్ చేస్తామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా పేదలకు ఇళ్ల పంపిణీ జరుగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. యుద్ధప్రాతిపదికన పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గానికి 10 ఇళ్లు కూడా కట్టలేదని మంత్రి ఆరోపించారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక నియోజకవర్గానికి 3500 ఇళ్లకుపైగా ఇచ్చామన్నారు.
రెండో విడతలో ప్రతి నియోజకవర్గానికి 2 వేల ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. రెండు విడతల్లో కలిపి ప్రతి నియోజకవర్గానికి 5,500 ఇళ్లకు పైగా ఇస్తామన్నారు. పట్టణాల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వమే ఎక్కువ ఇళ్లు నిర్మించిందని ప్రకటించారు. ''ఒక వేళ మేం ఇళ్లు కట్టలేదని నిరూపిస్తే ఎన్నికల్లో నేను పోటీ చేయను.. మేం ఇళ్లు కట్టినట్లు నిరూపిస్తే కేటీఆర్ పోటీ చేయకుండా ఉంటారా? '' అని మంత్రి పొంగులేటి కేటీఆర్ కు సవాల్ విసిరారు. తాము పట్టణాల్లో ఇళ్లు నిర్మించలేదని హరీశ్ రావు అంటున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హయంలో గృహనిర్మాణశాఖను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పదేళ్లలో కట్టిన వాటికంటే.. ఐదేళ్లలో తాము నిర్మించినవే ఎక్కువ ఉంటాయని పేర్కొన్నారు.






