రంగంపేటలో ధాన్యం లారీల కోసం రోడ్డు ఎక్కిన రైతన్న
సుమారు మూడు గంటల పాటు మెదక్ సంగారెడ్డి రహదారిపై రాస్తారోకో.
కొల్చారం మే 27: లారీల కోసం రైతన్నలు రంగంపేటలో రాస్తారోకో నిర్వహించారు. వారం రోజుల నుండి రంగంపేట సహకార సంఘం పరిధిలో ఏర్పాటుచేసిన రంగంపేట, పైతర, తుక్కాపూర్, కొనాపూర్, మాందాపూర్ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం లారీలు రాకపోవడంతో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు దాన్యం తడిసి ముద్దయింది. దీంతో ఆగ్రహించిన రైతన్నలు ఒక్కసారిగా మెదక్ సంగారెడ్డి ప్రధాన రహదారిపై రాస్తారోకో కు దిగారు. జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు నిర్లక్ష్యం మూలంగా ధాన్యం తరలింపులో జాప్యం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ రంగంపేటకు వచ్చి ధాన్యం తరలింపు పై స్పష్టమైన హామీ ఇచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని రైతులు భిష్మించుకు కూర్చున్నారు. కొల్చారం తహసిల్దార్ శ్రీనివాస చారి, ఎస్సై మహమ్మద్ మోహినుద్దీన్ లు రైతుల వద్దకు వచ్చి నచ్చజెప్పినప్పటికీ రైతులు ఆందోళన విరమించలేదు. జిల్లాస్థాయి అధికారులు వచ్చి స్పష్టమైన హామీ ఇస్తే తప్ప ఆందోళన నిర్మించేది లేదన్నారు.
దీంతో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ జగదీష్, జిల్లా పౌరసరఫరల శాఖ అధికారి నిత్యానంద రంగంపేటకు చేరుకొని ప్రతిరోజు లారీలు వచ్చేలా చర్యలు తీసుకుంటామని వారం రోజుల్లో కొనుగోలు కేంద్రంలో మొత్తం ధాన్యం తరలిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం అధ్యక్షులు అరిగి రమేష్, ఉపాధ్యక్షులు మోత్కు మల్లేశం, సర్పంచ్ల ఫోరం మండల శాఖ అధ్యక్షులు రవితేజ రెడ్డి, యువజన విభాగం మండల శాఖ అధ్యక్షులు సంతోష్ రావు, రంగంపేట సర్పంచ్ అడిగే విజయ్ స్వర్ణలత, ఉపసర్పంచ్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.






