3 July, 2026 | 8:47 PM

Breaking News

తాగారు.. దొరికారు..   •   కేజీబీవీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మండల ప్రత్యేక అధికారి   •   ఖానాపూర్ ఆర్టీసీ బస్టాండ్ పరిశీలించిన రీజినల్ మేనేజర్   •   శ్రీ లక్ష్మి భూలక్ష్మి సమేత శీతలాదేవి విగ్రహ ప్రతిష్ఠలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి   •   అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ   •   కస్తూర్బా గాంధీ విద్యార్థినీలకు ఏకరూప దుస్తులు, నోట్ బుక్స్ పంపిణీ   •   దేవ్ విజన్ సెంటర్ , ఆప్టికల్స్ ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా   •   సాధిక్ అలీ జయంతి సందర్భంగా శాంతినగర్ పాఠశాలకు డ్యూయల్ డెస్క్‌ల విరాళం   •   అధిక ఫీజుల దోపిడీని అరికట్టాలి: డీవైఎఫ్‌ఐ   •   డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ   •  

అన్నపురెడ్డిపల్లిలో ఆధ్యాత్మిక వెల్లువ..

06-05-2026 02:24 PM

శ్రీవారి సన్నిధిలో వైభవంగా 'మహా కుంభాభిషేకం'

సతీసమేతంగా పాల్గొన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

(ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, విజయ క్రాంతి):  భక్తి భావం వెల్లివిరిసింది.. వేద మంత్రం జయజయధ్వానమై ప్రతిధ్వనించింది.. అన్నపురెడ్డిపల్లి శ్రీశ్రీశ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం బుధవారం ఆధ్యాత్మిక కోలాహలంగా మారింది. లోక కల్యాణార్థం నిర్వహించిన మహా కుంభాభిషేక మహోత్సవంలో తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాధురి దంపతులు పాల్గొన్నారు. పరమపూజ్య శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి వారి దివ్య పర్యవేక్షణలో జరిగిన ఈ క్రతువుతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక పారవశ్యంలో మునిగిపోయింది.

వేదోక్తంగా కుంభాభిషేక క్రతువు

బ్రహ్మ ముహూర్తం నుంచే అర్చక బృందం హోమగుండాల వద్ద జపాలు, హోమాలు నిర్వహించారు. అనంతరం చినజీయర్ స్వామి వారి దివ్య హస్తాల మీదుగా కలశాలకు పవిత్ర జలాలతో అభిషేకం చేస్తుండగా, భక్తుల గోవింద నామస్మరణతో దిక్కులు పిక్కటిల్లాయి. ఈ మహోన్నత ఘట్టాన్ని మంత్రి పొంగులేటి దంపతులు భక్తిశ్రద్ధలతో వీక్షించారు. అనంతరం జరిగిన వేదాశీర్వచన కార్యక్రమంలో పండితులు మంత్రి దంపతులకు స్వామివారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేసి దీవించారు.

ప్రజల క్షేమం కోరి పూజలు

దర్శనానంతరం మంత్రి పొంగులేటి  మాట్లాడుతూ.. "చినజీయర్ స్వామి వారి పావన హస్తాల మీదుగా ఈ కుంభాభిషేకం జరగడం మనందరి అదృష్టం. స్వామివారి కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వెల్లివిరియాలని మనసారా ప్రార్థించాను" అని పేర్కొన్నారు.  ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు టీజీఐడీసీ చైర్మన్ మువ్వా విజయ బాబు, జిల్లా కలెక్టర్ అంకిత్,  డీసీసీ అధ్యక్షురాలు దేవీ ప్రసన్న, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.