అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ
కాళేశ్వరం ప్రాజెక్టు పై అవగాహన లేదు
విజయ రమణారావు మతిభ్రమించి మాట్లాడుతున్నారు
పాత్రికేయుల సమావేశంలో కరీంనగర్ భారాస జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు
మానకొండూరు,(విజయక్రాంతి): అబద్ధపు హామీలకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని భారాస పార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణారావు విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీసం అవగాహన లేకుండా పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణారావు మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన ఆరోపణలు దీటుగా ఖండించారు. ఘాటుగా బదులిచ్చారు. మానకొండూరులోని భారాస పార్టీ కార్యాలయంలో శుక్రవారం తాళ్లపల్లి శేఖర్ గౌడ్, రామంచ గోపాల్ రెడ్డి, శాతరాజు యాదగిరి, అడప శ్రీనివాస్, దండబోయిన శేఖర్, గుర్రం కిరణ్ గౌడ్, తదితరులు, పార్టీ శ్రేణులతో కలిసి పాత్రికేయుల సమావేశంలో రామకృష్ణారావు మాట్లాడారు.
విజయ రమణారావు హరీష్ రావు పై చేసిన విమర్శలు అర్ధరహితమని తేల్చి చెప్పారు. కేసీఆర్ కు పేరు వస్తుందనే దుగ్ధ తో కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లర్లకు మరమ్మత్తులు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండి పడ్డారు. కాలేశ్వరం ప్రాజెక్టుపై అధికార ప్రభుత్వం వేసిన గోష్ కమిటీ నివేదికను హైకోర్టు కొట్టి వేసిందని, ఈ విషయం కాంగ్రెస్ నాయకులు గుర్తెరిగి మాట్లాడాలని హితువు పలికారు. విజయ రమణారావు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. హరీష్ రావు పై ఎవరి మెప్పుకోసం రమణారావు అసంబద్ధ, అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని నిలదీశారు. హరీష్ రావు, కేటీఆర్ లు భరాసాకు రెండు కళ్ళని, ఈ ఇద్దరి నాయకులను చూస్తే కాంగ్రెస్ నాయకులు కలవరపాటుకు గురై, మతిభ్రమించి ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
72 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ ఏం ఒరగపెట్టారని ప్రశ్నించారు. హైదరాబాదులో చర్చకు రమ్మని పిలిచి, జవాబు చెప్పలేక అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. తులం బంగారం, నిరుద్యోగ భృతి, పింఛన్ల పెంపు, తదితర పథకాల అమలేదని మీడియా సాక్షిగా నిలదీశారు. మేడిగడ్డ, సుందిళ్ల, ఎల్లంపల్లి, అనంతగిరి, లక్ష్మీ పంప్ హౌస్, కాలేశ్వరం ప్రాజెక్టు చరిత్ర తెలుసుకొని మాట్లాడాలని విజయ రమణారావుకు పరోక్షకంగా చురకలంటించారు. అబద్ధపు హామీలతో ప్రజలను తప్పుదోవ పట్టించినా, కాంగ్రెస్ నాయకులను ప్రజలు రాబోయే కాలంలో ఇంటిదారి పట్టించడం ఖాయమని జోస్యం చెప్పారు.
టీఎంసీలు, ఆనకట్టలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు, అంటే కాంగ్రెస్ నాయకులకు అర్థం తెలియదని, డబ్బు ఎలా దోచుకోవాలో, సూట్ కేసులు ఎలా నింపాలో, బాగా తెలుసని ఎద్దేవా చేశారు. 1,531 కిలోమీటర్ల గ్రావిటీ కాలువలు,20 పంపు హౌస్ లు, 20 రిజర్వాయర్లు,1,832 కిలోమీటర్ల నీటి సరఫరా వ్యవస్థ,240 టీఎంసీల నీటి సామర్థ్యం,204 కిలోమీటర్ల టన్నెల్స్ కలిగిన బృహత్తర ప్రాజెక్టు కాళేశ్వరమన్నారు. ప్రాజెక్టులో మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం ఎల్లంపల్లి, మిడ్ మానేరు, లోయర్ మానేరు, అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, సింగూర్, నిజాంసాగర్ నుండి ఎస్సారెస్పీ వరకు అనుసంధానం కల్పించారని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాడని, దీన్ని రాజకీయాలకు బలి చేయక పునరుద్ధరించి, పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని భారాస పార్టీ పక్షాన డిమాండ్ చేశారు. మరోసారి హరీష్ రావు పై అసంబద్ధ ఆరోపణలు చేస్తే, సహించేది లేదని హెచ్చరించారు.






