22 August, 2026 | 6:59 PM

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

22-08-2026 06:00 PM

మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

ఉట్నూర్,(విజయక్రాంతి): దివ్యాంగుల సమగ్ర వికాసం, సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శనివారం ఉట్నూరులోని కేబీ కాంప్లెక్స్‌లో మహిళా శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 'దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీ' కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సమాజంలో దివ్యాంగులు ఎవరిపై ఆధారపడకుండా ఆత్మగౌరవంతో జీవించేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలను, పరికరాలను ప్రభుత్వం అందిస్తోందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎంపీ గోడం నగేష్ మాట్లాడుతూ.. దివ్యాంగులకు అవసరమైన ఆధునిక పరికరాలు, సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, సమాజంలో వారు ఎవరిపైనా ఆధారపడకుండా ముందుకు సాగేందుకు ఈ ఉపకరణాలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు మాట్లాడుతూ.. నియోజకవర్గ పరిధిలోని అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తామని, వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు.

అనంతరం దివ్యాంగులకు  30.68 లక్షల విలువగల 26 ఉపకరణాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ గోడం నగేష్, స్థానిక ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు, ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా, అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, పలువురుప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, దివ్యాంగులు పాల్గొన్నారు.