22 August, 2026 | 7:52 PM

అరక పట్టి.. పెసర విత్తనాలు నాటిన ఎమ్మెల్యే కనకయ్య

22-08-2026 06:02 PM

మహబూబాబాద్,(విజయక్రాంతి): ఎల్ నినో నేపథ్యంలో వర్షాభావ పరిస్థితుల్లో పప్పుధాన్యాల సాగుకు రైతులకు ముందుకు రావాలని ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం సంతులాల్‌ పోడు తండాలో  ఇల్లందు నియోజకవర్గ ఎమ్మెల్యే కోరం కనకయ్య, వ్యవసాయ శాఖ అధికారి రాజ్‌కుమార్ రైతులకు పప్పుధాన్యాల సాగు, తక్కువ నీటితో పండించే పంటలపై అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సంతులాల్‌ పోడు తండాకు చెందిన రైతు చాగర్లమూడి భాస్కర్ తనకు ఉన్న 20 ఎకరాల భూమిలో పప్పుధాన్యాలు సాగు చేసేందుకు ముందుకు వచ్చారు. రైతులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఎమ్మెల్యే కోరం కనకయ్య స్వయంగా అరక పట్టి పొలం దున్ని పెసర విత్తనాలు చల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అధిక నీరు అవసరం లేని పంటలను ఎంచుకుని వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని ఈ సందర్భంగా సూచించారు.

వర్షాలు ఆలస్యమైనా రైతులు అధైర్యపడకుండా పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని, పప్పుధాన్యాల సాగుతో తక్కువ నీటి వినియోగంతో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. రైతు భాస్కర్ ముందడుగు ఇతర రైతులకు స్ఫూర్తిగా నిలుస్తుందని ఎమ్మెల్యే కోరం కనకయ్య పేర్కొన్నారు.