22 August, 2026 | 7:51 PM

పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే కుట్రలు మానుకోవాలి

22-08-2026 06:34 PM

కొత్తగూడెం,(విజయక్రాంతి): పాలిటెక్నిక్ విద్యను నిర్వీర్యం చేసే విధానాలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ డిమాండ్ చేశారు. శనివారం పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అజిత్ మాట్లాడుతూ, పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో అనుసంధానం చేసే ఆలోచనను విరమించుకోవాలని కోరారు. ఈ నిర్ణయం అమలైతే వేలాది మంది విద్యార్థుల విద్యా, ఉపాధి అవకాశాలపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు.

డిప్లొమా విద్యార్థులకు ఉన్నత విద్యలో అవకాశాలు కల్పించే లాటరల్ ఎంట్రీ విధానాన్ని రద్దు చేయవద్దని అజిత్ కోరారు. విద్యార్థులకు నష్టం కలిగించే శక్తి స్కీమ్‌ను, జీవో నెంబర్ 97ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సాంకేతిక విద్యను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలపై ప్రభుత్వం విద్యార్థులు, అధ్యాపకులతో చర్చించాలని సూచించారు.

సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని, అవసరమైతే సమస్యల పరిష్కారం కోసం ఆమరణ దీక్షకు సైతం సిద్ధమని అజిత్ హెచ్చరించారు. విద్యార్థుల భవిష్యత్తును కాపాడే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి మాణిక్యాల వినయ్ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్ నాయకులు సలిగంటి జయదీప్, ముదిగొండ నిరీక్షణ,  ప్రియాంషీ, సాయి కృష్ణ, నీలాద్రి బండి హాని కృష్ణ తదితరులు పాల్గొన్నారు.