1300 దేశీదారు మద్యం బాటిళ్లు స్వాధీనం
- మహారాష్ట్ర నుంచి భీంసరి గ్రామానికి అక్రమంగా తరలిస్తుండగా పట్టివేత
- ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ నాగరాజు
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమంగా దేశీదారు మద్యాన్ని తరలిస్తున్న ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఆదిలాబాద్ రూరల్ మండలం భీంసరి గ్రామానికి చెందిన సిర్పురే జనార్ధన్ మహారాష్ట్రలోని చాంకా గ్రామానికి వెళ్లి గజానన్ రాములు బట్టిన్వార్ @ గజ్జు వద్ద రూ. 1,28,700 విలువ గల 1300 (90ml) దేశీదారు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు.
వాటిని అక్రమంగా ఆదిలాబాద్ జిల్లాకు తరలించి విక్రయించి సొమ్ము చేసుకునే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. తమకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ యార్డు వద్ద పోలీసులు అనుమానాస్పదంగా ఉన్న కారును తనిఖీ చేయగా, అందులో 13 బాక్సుల్లో 90 ఎంఎల్ పరిమాణం గల మొత్తం 1300 దేశీదారు మద్యం బాటిళ్లు ఉన్నట్లు గుర్తించారన్నారు. దీంతో కారులో మద్యం తరలిస్తున్న ప్రధాన నిందితుడు సిర్పురే జనార్ధన్‌ను అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో మద్యం విక్రయించిన మహారాష్ట్రకు చెందిన గజానన్ రాములు బట్టిన్వార్ @ గజ్జుపై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
పోలీస్ సిబ్బందికి ఎస్పీ అభినందనలు
ఈ కేసులో ఉత్తమ ప్రతిభ కనబరిచి అక్రమ మద్యం తరలింపును అడ్డుకోవడంలో కీలకంగా వ్యవహరించిన కానిస్టేబుళ్లు విట్టల్, క్రాంతిలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీసు ముఖ్య కార్యాలయంలో ప్రత్యేకంగా అభినందించారు. వారికి ప్రశంసా పత్రాలతో పాటు నగదు రివార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ టూ టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. నాగరాజు, ఎస్‌ఐలు అఖిల్, ప్రణయ్, కానిస్టేబుళ్లు క్రాంతి, విట్టల్ తదితరులు పాల్గొన్నారు.






