22 August, 2026 | 7:53 PM

చిరంజీవి స్ఫూర్తితో సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలి

22-08-2026 06:53 PM

* విద్యార్థులకు విద్యతో పాటు క్రమశిక్షణ నైతిక విలువలను బోధించాలి

గరిడేపల్లి,(విజయక్రాంతి): మెగాస్టార్ చిరంజీవి స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని చిరంజీవి సేవా సమితి మండల అధ్యక్షుడు కొండ సైదులు గౌడ్,  గౌరవ అధ్యక్షుడు తోడేటి వెంకటేశ్వర్లు సూచించారు. శనివారం చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకుని గరిడేపల్లి మండలంలోని అబ్బిరెడ్డిగూడెం ప్రాథమిక పాఠశాలలో చిరంజీవి అభిమాన సంఘం ఉపాధ్యక్షుడు గోలి హుస్సేన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వారు ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, పలకలు, ఇతర విద్యా సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సినిమా రంగంతో పాటు ప్రజా సేవ లోనూ చిరంజీవి తనదైన ముద్ర వేశారని అన్నారు. సేవా రంగంలోనూ ముందుండి ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని పరిణామాలు బాధ కలిగిస్తున్నాయని, విద్యార్థులు చెడు అలవాట్లకు బానిసలు కాకుండా మంచి అలవాట్లను అలవర్చుకుని ఉన్నత లక్ష్యాల వైపు ముందుకు సాగాలని సూచించారు.

ఉపాధ్యాయులు విద్యాబుద్ధులతో పాటు విద్యార్థులకు క్రమశిక్షణ, నైతిక విలువలను బోధించాలని కోరారు. చిరంజీవి ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులోనూ మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. కార్యక్రమంలో, గ్రామ సర్పంచ్ ఎడవల్లి కమలమ్మ, ఉపేందర్ రెడ్డి, హుస్సేన్, దవాజీ, కిషోర్, రాము, సైదులు, జానీ పాషా, నవీన్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి దస్తగిరి, ఉపాధ్యాయులు సైదిరెడ్డి, శ్రీనివాస్, రవీందర్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.