22 August, 2026 | 7:47 PM

9వ తరగతి నుంచే పదో తరగతి పరీక్షలకు సన్నద్ధం కావాలి

22-08-2026 06:48 PM

జిల్లా అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్

ఆసిఫాబాద్,(విజయక్రాంతి): 9వ తరగతి నుంచే విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలకు పటిష్టంగా సన్నద్ధం కావాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్ సూచించారు.శనివారం తిర్యాణి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 9వ తరగతి విద్యార్థులు, ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థుల విద్యా ప్రగతి, హాజరు, అభ్యసన సామర్థ్యాలు, క్రమశిక్షణ, భవిష్యత్ లక్ష్యాలపై చర్చించారు. విద్యార్థులు ప్రతిరోజూ క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరవుతూ, ఇంటి వద్ద కూడా పాఠ్యాంశాలను సాధన చేయాలని తెలిపారు.

ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యాలను పెంపొందించేలా పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.విద్యార్థుల సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టిన “విద్యా ప్లస్” కార్యక్రమం గురించి ఆయన వివరించారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

పిల్లల విద్యా ప్రగతిని తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులపై అధిక ఒత్తిడి లేకుండా వారి ఆసక్తులు, సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలని తెలిపారు. ప్రతి విద్యార్థిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుందని, దానిని గుర్తించి సరైన దిశలో ప్రోత్సహిస్తే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.