14 August, 2026 | 7:39 PM

మాదిగల ఐక్యతే బలం..

14-08-2026 06:18 PM

రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలి

మంథనిలో మాదిగ మహా శక్తి కోర్ కమిటీ సభ్యులు ఆసంపల్లి శ్రీనివాస్

మంథని,(విజయక్రాంతి): మాదిగల ఐక్యతే బలం అని రాజకీయ చైతన్యంతో ముందుకు సాగాలని మంథనిలో మాదిగ మహా శక్తి కోర్ కమిటీ సభ్యులు ఆసంపల్లి శ్రీనివాస్ పిలుపిచ్చారు. శుక్రవారం మంథని పట్టణంలోని బీఎస్‌ బ్యాంకెట్‌ హాల్‌లో మాదిగ జేఏసీ ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షుడు అక్కపాక సంపత్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించారు. సమావేశానికి మాదిగ మహాశక్తి కోర్‌ కమిటీ సభ్యులు ఆసంపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

మాదిగలు అనేక రంగాల్లో వెనుకబడి ఉన్నారని, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఎదగాలంటే ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మన ఓటు మనదే అనే నినాదంతో మాదిగలు ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు. మాదిగలకు రాజకీయ అవకాశాలు కల్పించని పార్టీలను ఓడించే దిశగా సమాజం కదలాలని అన్నారు.

మాదిగలు అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ తమ బలాన్ని తమ అభ్యున్నతి కోసం వినియోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంట్‌ వరకు మాదిగల ఓటు మాదిగల రాజకీయ ప్రాతినిధ్యానికి ఉపయోగపడేలా సమాజాన్ని చైతన్యపరచడమే లక్ష్యంగా పనిచేయాలని తెలిపారు. మాదిగల అభ్యున్నతికి తనవంతు అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

మంథనిలో త్వరలో మాదిగల “అలై బలై” కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి మాదిగలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఐక్యత, బలాన్ని చాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పుల గట్టయ్య, కన్నూరి రాజబాపు, మంథని లక్ష్మణ్‌, కన్నూరి బాపు, వేల్పుల పోషం, బూడిద తిరుపతి, కాసిపేట సాంబయ్య, దేవల్ల విజయ్‌, కొయ్యల రాజమల్లు, కరుణ కృష్ణ, మంథని లింగయ్య, శ్రీకాంత్‌, రమేష్‌, బానేష్‌, శేఖర్‌, ప్రభాకర్‌, రామన్న, రాజేశ్వర్‌, సంపత్‌ తదితర నాయకులు పాల్గొన్నారు.