14 August, 2026 | 8:33 PM

కోదాడ పట్టణ ఆర్యవైశ్య అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఆశీర్వదించండి

14-08-2026 07:26 PM

అభ్యర్థి బండారు శ్రీనివాసరావు విజ్ఞప్తి

కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణ ఆర్యవైశ్య అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న తనను ఆశీర్వదించాల్సిందిగా అభ్యర్థి బండారు శ్రీనివాసరావు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా సంఘానికి సేవ చేసిన పెద్దలను గౌరవిస్తూ, వారి మంచి కార్యక్రమాలను కొనసాగిస్తూనే పారదర్శకత తోపాటు కొత్త దిశగా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని మీ ముందుకు వస్తున్నాను. గతంలో లాగా కాకుండా నా రెండేళ్ల పదవీకాలం పూర్తయిన అనంతరం నేను స్వచ్ఛందంగా వైదొలగి, జిల్లా సంఘానికి తెలిపి, నూతన కార్యవర్గం ఏర్పాటుకు పూర్తి సహకారం అందిస్తూ ఆదర్శవంతంగా వ్యవహరిస్తాను.

ప్రమాణ స్వీకారం జరిగిన రోజే తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసి, కార్యాలయం అనేది ప్రతి ఆర్యవైశ్యుని సమస్య పరిష్కారానికి ఒక "కేర్ ఆఫ్ అడ్రస్" గా తీర్చిదిద్దుతాను. ప్రతి సంవత్సరం రిపబ్లిక్ డే రోజు మరియు స్వతంత్ర దినోత్సవం రోజు భారత జాతీయ జెండాని సగర్వంగా ఎగరవేస్తూ ఈ సందర్భంగా ఆర్యవైశ్య సభ్యులందరికీ అల్పాహారం ఏర్పాటు చేస్తాను. ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గతంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లా ఆర్యవైశ్య సంఘం సహకారంతో ఒక ఎకరం స్థలం సాధించేందుకు కృషి చేసి భవన శంకుస్థాపన జరిగేలా ప్రయత్నిస్తాను.

కోదాడలోని ప్రతి వార్డుకు ఒక ఇంచార్జీను నియమించి, ప్రతి ఆర్యవైశ్య కుటుంబం ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించే విధానం అమలు చేస్తాను. బీద ఆర్యవైశ్య విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ల్యాప్‌టాప్‌లు, విద్యా సహాయం అందించే ప్రత్యేక కార్యక్రమాలు చేపడతాను. "ఆర్యవైశ్యుడు ఎక్కడ ఉంటే అక్కడ బడి, గుడి, పచ్చదనం" ఉంటుంది అనే నానుడిని నిజం చేస్తూ 30 వేల మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణలో జిల్లాలోనే ఆదర్శంగా నిలుస్తాం. అధికార పార్టీతో సత్సంబంధాలు ఉన్న నేను ప్రభుత్వ శాఖలు, పోలీస్, ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసి ఆర్య వైశ్యులు ఎదుర్కొనే ప్రతి సమస్యకు త్వరితగతిన పరిష్కారం తీసుకురావడానికి కృషి చేస్తాను.

యువత, మహిళలు, పెద్దలకు ఉచిత డిజిటల్ అవగాహన తరగతులు నిర్వహించి, ఆన్‌లైన్ సేవల వినియోగంపై శిక్షణ అందించి సైబర్ మోసాలపై అవగాహన కల్పించే కార్యక్రమం వెనువెంటనే చేపడుతాం. కార్తీకమాస వనభోజనాలు, దసరా శరన్నవరాత్రులు, వాసవి మాత ఉత్సవాలను గతంలో కంటే మరింత వైభవంగా నిర్వహిస్తాము. కార్యక్రమాల అనంతరం సేవ చేసిన కమిటీ సభ్యులకు చక్కటి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. బీద ఆర్యవైశ్య కుటుంబంలో దురదృష్టవశాత్తు మరణం సంభవించినప్పుడు తక్షణ ఆర్థిక సహాయం అందించే ప్రత్యేక నిధిని, అంతిమ సంస్కారాల ఏర్పాటుకు కృషి చేస్తాను.

విదేశాల్లో చదవాలనుకునే ప్రతిభావంతులైన ఆర్యవైశ్య బీద విద్యార్థులకు గైడెన్స్, స్కాలర్‌షిప్ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాను. పట్టణంలోని ఆర్యవైశ్య ప్రత్యేక మహిళా విభాగం వారితో సమన్వయం చేసుకుంటూ, స్నేహపూర్వకంగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి మా చేదోడు అందిస్తాము. ఇందిరమ్మ ఇళ్లు, సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణమస్తు (కల్యాణలక్ష్మి) తదితర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఆర్యవైశ్య కుటుంబానికి అందే వరకు అధికారులతో నిరంతరం ఫాలోఅప్ చేస్తాను.  ప్రతి రూపాయి లెక్కను ఆయా కార్యక్రమాల అనంతరం కార్యవర్గ సభ్యుల ముందు పారదర్శకంగా ఉంచుతాను.

ప్రతి నిర్ణయం కార్యవర్గ సభ్యులతో చర్చించి తీసుకుంటాను.- పట్టణంలోని ప్రతి ఆర్యవైశ్య కుటుంబం నాకు సమానమే.  పదవి కోసం కాదు... సేవ కోసమే పని చేస్తాను. గతంలో వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థలో క్లబ్ అధ్యక్షుడిగా, జిల్లాస్థాయి అధికారిగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి కోదాడ పట్టణ ఆర్యవైశ్యులకు మాత్రమే కాకుండా అందరి ప్రజలకు సేవ చేసే భాగ్యం కలిగించినందుకు మీకు మరియు ఆ జగజ్జనని వాసవిమాతకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే ఈసారి మీ అందరి ఆశీర్వాదముతో కోదాడ పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడిగా సేవ చేసే అవకాశం ఇవ్వమని విజ్ఞప్తి చేశారు.