గర్భిణిని సురక్షితంగా కొండాయి వాగు దాటించిన వైద్య సిబ్బంది
ములుగు, జూలై 31 (విజయక్రాంతి): జిల్లాలోని ఏటూరునాగారం మండలంలోని మల్యాల కొత్త కోయగూడెం గ్రామానికి చెందిన గుత్తికోయ గర్భిణిని భారీ వర్షాలు, వరదల మధ్య వైద్య సిబ్బంది సురక్షితంగా కొండాయి వాగు దాటించి ఆసుపత్రికి తరలించారు. భారీ వర్షాల కారణంగా వాగు ఉప్పొంగి రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో గర్భిణికి సకాలంలో వైద్య సేవ లు అందించేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు.
పడవ సహాయంతో గర్భిణిని కొండాయి వాగు దాటించి, అనంతరం 108 అంబులెన్స్ ద్వారా సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించి గర్భిణికి సకాలంలో చికిత్స అందేలా చర్యలు తీసుకోవ డంతో స్థానికులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.ప్రణీత్‌కుమార్, హెల్త్ అసిస్టెంట్ కె.భాస్కర్‌రావు పాల్గొన్నారు.






