అంతర్గత వీధుల్లో కాలినడక కష్టమే..!
మహబూబాబాద్, జూలై 31 (విజయక్రాంతి): పేరుకే జిల్లా కేంద్రం.. అయినప్పటికీ అంతర్గత వీధుల్లో సరైన రోడ్డు సౌకర్యం లేక ప్రజలు వర్షాకాలంలో కాలినడక కూడా అనేక కష్టాలు పడాల్సిన పరిస్థితి మహబూబాబాద్ మునిసిపాలిటీలో నెలకొంది. ఎన్నో ఏళ్ల నుంచి ఏర్పడ్డ ఆవాస ప్రాంతాలకు ప్రధాన రహదారుల నుండి అంతర్గత రహదారులకు మెరుగైన సౌకర్యం కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆయా ఆవాస ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మహబూబాబాద్ పట్టణంలోని పలు వీధుల్లో ఇప్పటికీ సరైన రోజు వసతి లేదని పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో తమ కష్టాలను ఓటేసి గెలిపిస్తే వెంటనే తీరుస్తామంటూ హామీలు గుప్పించి, ఎన్నికలు ముగిసిపోగానే తమను పట్టించుకునే నాధుడే లేడని ఆరోపిస్తున్నారు. ఇక మరికొన్ని చోట్ల ప్రభుత్వం రోడ్ల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసి, పనులు చేపట్టడం లేదని స్వయంగా కౌన్సిలర్లు ఆవేదన, నిరసన వ్యక్తం చేస్తున్న సంఘటనలు జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి.
మహబూబాబాద్ పట్టణంలో 22వ వార్డులో అంతర్గత రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరైనా ఇప్పటివరకు పనులు చేపట్టడం లేదని ఏకంగా శుక్రవారం బురద రోడ్లపై నాట్లు వేసి నిరసన తెలిపారు. ఇలాగే ఇటీవల 25వ వార్డులో రోడ్డు సరిగా లేదంటూ బురదలో కూర్చొని ఏకంగా వార్డు కౌన్సిలర్ నర్రా సంధ్య వినూత్న తరహాలో నిరసనకు దిగారు. చిన్నపాటి వర్షానికే వీధుల్లో వర్షం నీరు ఎక్కడి కక్కడే నిలిచిపోయి ప్రజలకు తీవ్ర అవస్థలు కలిగిస్తున్నాయని ఆరోపిస్తున్నారు.
ఎన్నికల సమయంలో ప్రజల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిధులు మంజూరు చేసి రోడ్లు నిర్మిస్తామంటూ శిలాఫలకాలు వేసి శంకుస్థాపనలు చేసి, వాటి ఊసే పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. కాలనీ ఏర్పడి 22 ఏళ్లు గడిచినా కనీసం ఇంటర్నల్ రహదారి నిర్మించలేదని వార్డు కౌన్సిలర్ ఆరోపించారు. కనీసం పల్లెల్లోనైనా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో సిమెంటు రోడ్లు వేసి మెరుగైన రహదారి వసతి కల్పించారని, పేరుకే మహబూబాబాద్ జిల్లా కేంద్రం..
మున్సిపాలిటీ అంటూ పట్టణంలోని పలు వీధుల్లో సరైన రహదారులు లేకపోవడం దౌర్భాగ్యకర పరిస్థితి నెలకొందని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పట్టణంలోని అన్ని వీధుల్లో మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించి, డ్రైనేజీ, విద్యుత్, తాగునీటి వసతి మెరుగుపరచాలని ప్రజలు కోరుకుందాం.
కేసముద్రంలో దారి లేకుండా చేశారు..!?
ఇక కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారుల వెంట గతంలో ఉన్న డ్రైనేజీని కొత్తగా నిర్మించడానికి తొలగించారు. అయితే ఇప్పటివరకు పనులు చేపట్టకపోవడంతో మురుగునీరు అంతా ఎక్కడికి అక్కడే పోయింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పరిస్థితి మరింత అధ్వానంగా మారడంతో మున్సిపాలిటీ సిబ్బంది ఎక్కడికక్కడే నిలిచిపోయిన మురుగునీరు దిగువకు వెళ్లడానికి గతంలో ఉన్న డ్రైనేజీ కాల్వల మాదిరిగా కొత్తగా కాలువలు తీశారు.
దీనితో ఆ వీధుల్లోకి వెళ్లడానికి ప్రజలకు రహదారి సౌకర్యం లేకుండా పోయింది. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడింది అన్న చందంగా.. ముందుగా డ్రైనేజీ పనులు నిర్మించి, రోడ్డు క్రాసింగుల వద్ద సిమెంటు స్లాబు వేసి ఇబ్బందులు లేకుండా చేసిన తర్వాత రోడ్డు విస్తరించాల్సి ఉండగా, అందుకు భిన్నంగా పాత డ్రైనేజీని పూర్తిగా తొలగించి కొత్తది నిర్మించకుండా, మురుగునీరు బయటకు వెళ్లడానికి రోజుకు ఇరువైపులా కాలువలు తీయడంతో ఇప్పుడు అంతర్గత రహదారులకు వెళ్లడానికి ఇబ్బందిగా మారింది.






