రోడ్డు దుస్థితితో తృటిలో తప్పిన ప్రమాదం
తీర్మానాలకే పరిమితమైన మున్సిపల్ కౌన్సిల్
చేర్యాల,జూలై 31 : చేర్యాల పట్టణంలోని అంగడి బజారు నుంచి ఆకునూరు వెళ్లే రోడ్డుపై శుక్రవారం ఓ పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదవశాత్తు పక్కకు ఒరిగింది. గుంతలతో నిండిన రోడ్డుపై ట్యాంకర్ ఒరిగడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
తీర్మానాలు కాగితాలకే పరిమితం
జూలై 29న జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఈ రోడ్డుపై హెచ్చరిక బోర్డులు పెట్టాలని తీర్మానించారు. కానీ ఆ తీర్మానాలు కాగితాలకే పరిమితం కావడంతో భారీ వాహనాలు యథావిధిగా రాకపోకలు సాగిస్తున్నాయి. తీర్మానం అమలు కాకముందే ప్రమాదం జరగడంపై ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ‘కాగితాలకే పరిమితమయ్యే తీర్మానాలు ఎందుకు? ఇప్పటికైనా గుంతలు పూడ్చి రహదారిని మరమ్మతు చేయాలి‘ అని స్థానికులు డిమాండ్ చేశారు.






