సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి
కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నాగరాణి
కామారెడ్డి సబ్ జైలు ను సందర్శించిన జడ్జి
కామారెడ్డి, ఏప్రిల్ 6 (విజయక్రాంతి): ఖైదీలకు సత్వర న్యాయం సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని జైలు సూపర్డెంట్ ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, జడ్జి నాగరాణి సూచించారు. సోమవారం కామారెడ్డి సబ్ జైలు సందర్శించి ఖైదీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ, హైదరాబాద్ ఆదేశాల మేరకు కామారెడ్డి సబ్ జైల్ లో ఖైదీలకు అందుతున్న ఉచిత న్యాయ సహాయ సేవలు, లీగల్ ఎయిడ్ క్లినిక్ కార్యకలాపాలు, నిర్వహణ విధానాన్ని సమీక్షించారు.
ఖైదీలతో ముఖాముఖి సమావేశం నిర్వహించి, వారి సమస్యలను తెలుసు కున్నారు, వారికి ఉచిత న్యాయ సహాయం, హక్కులు న్యాయ సేవాధికార సంస్థ ద్వారా అందించే సేవలపై స్పష్టమైన అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా ఖైదీల మానవ హక్కుల పరిరక్షణ, న్యాయ సహాయం పొందే హక్కు, కేసుల పురోగతి వంటి అంశాలపై వివరించారు, అవసరమైన న్యాయ సహాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం జైలు వంటగది, పరిశుభ్రత పరిస్థితులు, ఫిర్యాదు పెట్టెలను తనిఖీ చేసి తగిన మెరుగుదల చర్యలు చేపట్టాలని జైలు అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ మాయ సురేష్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ శ్రీనివాస్, జైలు సూపరింటెండెంట్ సంజీవ్ రెడ్డి, జైలు సిబ్బంది, న్యాయ సేవా సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్ ఖాజా సమిఉల్లాహ్ఖాన్ తదితరులు పాల్గొన్నారు.




