1 May, 2026 | 8:35 PM

కార్మికుల శ్రమే సమాజ అభివృద్ధికి మూలస్థంభం

01-05-2026 07:28 PM

కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడికి గౌరవం ఇవ్వాలి

అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్

వనపర్తి,(విజయక్రాంతి): కార్మికుల శ్రమే సమాజ అభివృద్ధికి మూలస్థంభమని, కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడికి గౌరవం ఇవ్వాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ వినోద్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మే డే(మే 1) అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

కార్యక్రమంలో డీఎస్పీ బాలాజీ నాయక్, జెడ్పీ సీఈఓ యాదయ్య, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు మరియు ఇతర కార్మికులను అధికారులు ఘనంగా సన్మానించారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా జిల్లాలోనే అత్యధిక పని దినాలు పనిచేసిన కార్మికురాలు విజయమ్మను కూడా సన్మానించారు. అలాగే ఐటీఐ విద్యార్థులకు ప్రతిభా పురస్కార పత్రాలు అందజేశారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ కార్మికుల శ్రమే సమాజ అభివృద్ధికి మూలస్థంభమని అన్నారు. ప్రతి రంగంలో కార్మికుల పాత్ర అమూల్యమని తెలిపారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్మికుడికి గౌరవం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల్లో కార్మికుల సహకారం కీలకమని చెప్పారు. కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కార్మికుల చట్టాలపై వారిలో అవగాహన కల్పించి కార్మికుల హక్కులను కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

సమాన పనికి సమాన వేతనం ఇవ్వడమే వారికి ఇచ్చే గౌరవం అని తెలిపారు. జిల్లాలోని పరిశ్రమలు కూడా తమ వద్ద పనిచేసే కార్మికులకు మంచి వసతులు కల్పించాలని సూచించారు. అదేవిధంగా కార్మిక శాఖ అధికారులు జిల్లా నుంచి వలస వెళ్లిన వారిని జాతరలు, మరి ఏదైనా ఇతర వేడుకల సందర్భంగా వారు ఇక్కడికి వచ్చినప్పుడు వారిని కలుసుకొని వారికి కార్మిక చట్టాలపై అవగాహన కల్పించి కార్మిక శాఖ తరఫున అందిస్తున్న పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా జిల్లాలో బాల కార్మికులు ఎక్కడైనా ఉన్నట్లు దృష్టికి వస్తే వారిని రక్షించాలని సూచించారు.

కార్మికుల కృషి వల్లనే సమాజం ముందుకు డీఎస్పీ బాలాజీ నాయక్

కార్మికుల కృషి వల్లనే సమాజం ముందుకు సాగుతుందని డీఎస్పీ బాలాజీ నాయక్ అన్నారు. ప్రతి వ్యక్తి తన పని పట్ల నిబద్ధతతో ఉండాలని సూచించారు. కార్మికులకు గౌరవం ఇవ్వడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. క్రమశిక్షణ, శ్రమతో విజయాలు సాధ్యమవుతాయని చెప్పారు. కార్మికుల హక్కులను కాపాడటంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఐటిఐ కళాశాలకు సంబంధించిన అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ లో విద్యార్థులకు అందుబాటులో ఉన్న కోర్సులకు సంబంధించిన పోస్టర్, కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక చట్టాలపై, కార్మికులకు కల్పించే పథకాలపై రూపొందించిన బుక్లెట్ ను అధికారులు ఆవిష్కరించారు. జిల్లాకు చెందిన ఏ బీడీ లిక్కర్ పరిశ్రమలో 1600 మంది కార్మికులు పనిచేస్తున్నారని, వారికి మంచి వసతులు కల్పిస్తున్న యాజమాన్యం తరఫున హాజరైన రీజనల్ మేనేజర్ ఉమాశంకర్ ను శాలువాతో సత్కరించారు.