పోస్ట్ ఆఫీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
– సబ్ డివిజనల్ పోస్టల్ ఇన్స్పెక్టర్ మాలోత్ వీరన్న
దమ్మపేట,(విజయ క్రాంతి): దమ్మపేట మండల పరిధిలోని లింగాలపల్లి గ్రామ పోస్టాఫీస్‌లో గ్రామ ప్రజలకు పోస్టాఫీస్ అందిస్తున్న వివిధ సేవలు, పొదుపు పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్వంచ సబ్ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ మాలోత్ వీరన్న ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. భారత తపాలా శాఖ ప్రజలకు అనేక రకాల పొదుపు, భీమా, ఆర్థిక సేవలను అందిస్తోందని తెలిపారు. పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ), టైమ్ డిపాజిట్ (టీడీ), మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (ఎంఐఎస్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్‌ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సుకన్య సమృద్ధి యోజన, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (పీఎల్‌ఐ), గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ (ఆర్‌పీఎల్‌ఐ) వంటి పథకాల ద్వారా ప్రజలు భద్రంగా పెట్టుబడులు పెట్టి మంచి ప్రయోజనాలు పొందవచ్చని వివరించారు.
అదేవిధంగా ఆధార్ సేవలు, ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు, నగదు లావాదేవీలు, మనీ ట్రాన్స్‌ఫర్, స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ పోస్ట్ వంటి సేవలను కూడా పోస్టాఫీస్ ద్వారా సులభంగా పొందవచ్చని తెలిపారు. గ్రామీణ ప్రజలు పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్న సేవలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అప్పారావు, మాజీ సర్పంచ్, చాప రాఘవయ్య, పంచాయతీ కార్యదర్శి, మాలోత్ రాంబాబు, బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, టి.గిరిబాబు , ఎన్.శ్రీను అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్, పోస్టాఫీస్ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.






