ప్రాజెక్టుల భూసేకరణ వేగవంతం చేయాలి
రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు
సిద్దిపేట కలెక్టరేట్: జిల్లాలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ కె. హైమావతితో కలిసి ఇరిగేషన్ ప్రాజెక్టుల భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ అంశాలపై సమీక్ష నిర్వహించారు. దేవాదుల ప్రాజెక్టు పరిధిలో చేర్యాల, కొమురవెల్లి, కొండపాక, మద్దూర్, ధూల్మిట్ట మండలాల్లో తపాస్‌పల్లి రిజర్వాయర్ డిస్ట్రిబ్యూటరీ కాలువలు, గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూ సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని, మల్లన్నసాగర్ నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న ఆర్ అండ్ ఆర్ అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఆర్డీవోలు, రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు పాల్గొన్నారు.






