1 July, 2026 | 2:05 AM

రైతు వంచన సభ

01-07-2026 01:09 AM
  1. యాసంగి రైతుబంధు ఎగ్గొట్టి.. వానాకాలానికి వేస్తానంటూ మోసం 
  2. 7 రకాల సన్నాలకే బోనస్ అంటూ దగా 
  3. లక్షలోపు కూడా రైతు రుణమాఫీ చెయ్యలే 
  4. యూరియా యాప్ తెచ్చి సీఎం రేవంత్ నాటకాలు 
  5. మాజీమంత్రి హరీశ్‌రావు

జడ్చర్ల, జూన్ 30: సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌లో రైతు ఆశీర్వాద సభ అని పెడుతున్నాడని, అది ఆశీర్వాద సభ కాదు రైతుల వంచన సభ అని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి రైతును వంచిస్తూనే ఉన్నాడన్నారు. దళారుల చేతిలో, రైస్‌మిల్లర్ల చేతిలో సీఎం రేవంత్ తోలుబొమ్మ అని, యాసంగి రైతుబంధు ఎగ్గొట్టి ఇప్పుడు వానాకాలం రైతుబంధు వేస్తానని మోసం చేస్తున్నాడని విమర్శించారు.

రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ అని చెప్పి, లక్ష లోపు ఉన్నవాళ్లకు కూడా చెయ్యలేదన్నారు. మంగళ వారం మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. కనబడ్డ దేవుని మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చెయ్యకుండా దేవుళ్లనే మోసం చేసిన ఘనుడు సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. రేవంత్‌రెడ్డి జూటా మాటలతో పాలమూరు పరువు తీస్తున్నాడని పేర్కొన్నారు.

రైతుబంధు పేరిట రూ.29,300 కోట్లు రైతులకు రేవంత్‌రెడ్డి బాకీపడ్డాడని చెప్పారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మతి ఉండి మాట్లాడుతాడో మతి లేక మాట్లాడతాడో అర్ధం కాదన్నారు. ఎన్నికలకు ముందు అన్ని పంటలకు బోనస్ అన్నారు. అధికారంలోకి వచ్చాక సన్న వడ్లకే అన్నారు. ఇప్పుడు కేవలం 7రకాల వడ్లకే అంటున్నారని పేర్కొన్నారు. బోనస్ రూ.3 వేల కోట్లు, రైతుబంధు రూ.30 వేల కోట్లు ఎగ్గొటారని తెలిపారు.

యూరియా కోసం రేవంత్‌రెడ్డి యాపులు తెచ్చి నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. అసెంబ్లీలో తరుగు పెడితే తోలు తీస్తా అని ప్రకటించిన సీఎం.. ఏ ఊరులో అయినా తరుగు లేకుండా ఒక్క బస్తా కొన్నారా అని ప్రశ్నించారు. దళారుల చేతిలో, రైస్ మిల్లర్ల చేతిలో రేవంత్‌రెడ్డి తోలు బొమ్మ అని ఆరోపించారు. రైతులకు 6 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తూ కోత పెట్టడానికే రైతు డిస్కం తెస్తున్నారని మండిపడ్డారు. రైతు డిస్కమ్ అనేది రైతు 24 గంటల కరెంటుకి ఉరితాడు అవుతుందని జోస్యం చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుబీమా బంద్ అయ్యిందని, ఎల్‌ఐసీకి బీమా డబ్బులను రేవంత్‌రెడ్డి కట్టలేదన్నారు. 7,600 రైతు కుటుంబాలు రైతుబీమా కోసం ఎదురుచూస్తున్నాయని చెప్పారు. కరోనా వచ్చినా కరువు వచ్చినా కేసీఆర్ హయాంలో రైతు బంధు ఆగలేదని, 11 విడతల్లో 73 వేల కోట్ల రూపాయల రైతు బందు ఇచ్చాడు కేసీఆర్.

రేవంత్ రెడ్డి వచ్చాక వచ్చిన 5విడతల్లో 3 విడతలు ఎగొట్టాడని పేర్కొన్నారు. మూడు పంటలకు 3సార్లు రైతు బంధు ఇవ్వాలన్నాడు ఇప్పటికే మూడు రైతు బంధులు ఎగ్గొట్టాడని చెప్పారు. రైతులకు బాకీపడ్డ 30 వేల కోట్లు ఎప్పుడు ఇస్తావో చెప్పాలని రైతుల పక్షాన డిమాండ్ చేశారు. 

కేంద్రానికి సరెండర్ అయ్యారా? 

కేంద్రం కొనమన్న పంటే కొంటాం అని అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రానికి సరెండర్ అయ్యారని ఎద్దేవా చేశారు. పాలమూరు పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చిన ఘనత కేసీఆర్ అన్నారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్నా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. తుంగభద్ర నది మీద శ్రీశైలంకు నీళ్లు రాకుండా 65 టీఎంసీలతో ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలు డ్యాములు కడుతుంటే మన పాలమూరు రంగారెడ్డి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.

ఇంటెర్లింకింగ్ అఫ్ రివర్స్, ఆల్మట్టి ఎత్తు, అక్రమ ప్రాజెక్టులు తుంగభద్ర, కృష్ణపై కడుతున్న ప్రాజెక్ట్ లపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా నోరు మూసుకున్నారని పేర్కొన్నారు. హైకోర్టు మొట్టికాయలు వేసినా పిల్లలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వడం లేదన్నారు. సంగారెడ్డి పాశంమైలారం సిగాచి ఘటనలో 54 మంది చనిపోతే మనిషికి రూ.కోటి చొప్పున ఇస్తామన్న పరిహారం ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు.

స్వరాష్ట్ర సాధన కోసం నాడు రేవంత్‌రెడ్డిని రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఇచ్చి పారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలమూరులో 14 సీట్లకు 14 సీట్లను గెలిచి తీరుతాం. బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు డా సీ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వరరెడ్డి, అంజయ్య యాదవ్, నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు వాళ్య నాయక్, వెంకటేశ్వర్‌రెడ్డి, రజినీ సాయిచంద్ పాల్గొన్నారు.