1 July, 2026 | 2:05 AM

యాదగిరిగుట్ట ఆలయానికి కొత్త బోర్డు

01-07-2026 01:05 AM
  1. బోర్డు చైర్మన్‌గా మన్నె సత్యనారాయణరెడ్డి
  2.   18 మంది సభ్యులతో ఏర్పాటు
  3. ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
  4. సభ్యురాలిగా విజయక్రాంతి దినపత్రిక డైరెక్టర్ విజయరాజం

హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే గురువారం గుట్ట అభివృద్ధిపై అధికారులతో చర్చించారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదగిరిగుట్ట లక్ష్మీనర సింహస్వామి దేవస్థానానికి నూతన బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇనిస్టిట్యూషన్స్ అండ్ ఎం డోమెంట్స్ చట్టం ప్రకారం సరికొత్త పాలక మండలిని ఏర్పాటు చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఉత్తర్వులు జారీ చేశారు. బోర్డుకు చైర్మన్‌గా మన్నె సత్యనారాయణరెడ్డి నియమితులయ్యారు. బోర్డులో చైర్మన్‌తో పాటు సభ్యులుగా, ఎక్స్-అఫీషియో సభ్యులుగా మొత్తం 18 మందికి చోటు దక్కింది.

సభ్యులుగా ఎమ్మెల్యే వినోద్ వెంకటస్వామి, మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ, విజయక్రాంతి దినపత్రిక డైరెక్టర్ చిలపగారి విజయరాజం, విజయేందర్ తుల్లా, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కాంతమణి, ఎం రాఘవేందర్‌రావు, డాక్టర్ లక్ష్మీనారాయణ నాయక్, ఫౌండర్ ట్రస్టీ నియమితులయ్యారు.

ఎక్స్-అఫీషియో సభ్యులుగా ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎండోమెంట్స్) శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సీనియర్ ప్రధాన అర్చకులు ఈజిల్లా కలెక్టర్, యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్, యాదగిరిగుట్ట దేవస్థానం ఈవో, సీనియర్ ప్రధాన అర్చకులు ఉంటారు. 

రెండేళ్ల పదవీ కాలం

ఎక్స్-అఫీషియో సభ్యులు, ఫౌండర్ ట్రస్టీ మినహా మిగిలిన నామినేటెడ్ సభ్యులు, చైర్మన్ పదవీ కాలం వా రు బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి రెండు సంవత్సరాల పాటు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అమలులో ఉంటుంది. నూతనంగా నియమితులైన చైర్మన్, సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించడానికి యాదగిరిగుట్ట దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆదేశించింది.