అగ్ని ప్రమాదంలో మొక్కజొన్న పంట బుగ్గిపాలు
మహబూబాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా బయ్యారం, కేసముద్రం మండలాల్లో అగ్ని ప్రమాదం సంభవించి పలువురు రైతులకు చెందిన మొక్కజొన్న బుగ్గిపాలు అయ్యింది. బయ్యారం మండలంలోని కొత్తగూడెం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి మొక్కజొన్న పంటలు అగ్నికి ఆహుతి అయ్యాయి. దారావత్ హరిరాల్ కి సంబంధించిన రెండు ఎకరాలు, ఈసం శ్రీకాంత్ కు మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది.
ఆరుగాలం కష్టించి పండించిన పంట ఇలా అగ్నికి ఆహుతి కావడంతో నష్టం కలిగిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే వారికి నష్టపరిహారం అందించాల్సిందిగా కోరుతున్నారు. మంటలు చెలరేగగానే వెంటనే స్పందించిన పరిసర ప్రాంతాల ప్రజలు గ్రామపంచాయతీ వాటర్ ట్రాక్టర్ ద్వారా నీటిని తెచ్చి మంటలు విస్తరించకుండా అడ్డుకోగలిగారు. అయితే అప్పటికే రైతులకు సంబంధించిన మొక్కజొన్న పంట, వ్యవసాయ సాగు పరికరాలు, మోటార్లు దగ్ధం అయ్యాయి. లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
కేసముద్రంలో..
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో జరిగిన అగ్నిప్రమాదంలో దొంతరబోయిన కొమురయ్యకు చెందిన 3 ఎకరాలు, దొంతరబోయిన సురేష్ 2, దొంతరబోయిన ఐలయ్య 3, జక్కుల కట్టమల్లుకు 3, పుణ్యపుర్తి ఐలయ్య చెందిన 4 ఎకరాలు పూర్తిస్థాయిలో మొక్కజొన్న పంట దగ్ధమైనట్లు చెప్పారు. అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో మహబూబాబాద్ నుంచి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపులోకి తెచ్చింది. అయితే అంతకు ముందే 15 ఎకరాలలో సుమారుగా మొక్కజొన్న పంటను దగ్ధం అయినట్టు బాధితులు తెలిపారు. ప్రభుత్వం ఆదుకొని పరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు. పంట చేలల్లో విద్యుత్తు లైన్లో రాపిడి వల్ల నిప్పులు చెలరేగి అగ్నిప్రమాదం సంభవించినట్లు రైతులు చెబుతున్నారు.






