వృద్ధ దంపతుల ఇంట్లో బంగారం చోరీ.. పనిమనిషి అరెస్టు
సుమారు 83 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం
ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని కాకతీయ నగర్‌లో వృద్ధ దంపతుల ఇంట్లో జరిగిన బంగారు ఆభరణాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఇంటి పనిమనిషిగా పనిచేస్తున్న కారేపల్లి మండలం టేకులగూడెం గ్రామానికి చెందిన వేమూరి షిబారాణి అలియాస్ సీత (20)ను అరెస్టు చేసి, ఆమె వద్ద నుంచి సుమారు 83 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు ఇల్లందు డీఎస్పీ వెంకన్న బాబు తెలిపారు.
సోమవారం డీఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందుల కారణంగా నిందితురాలు యజమానుల నమ్మకాన్ని దుర్వినియోగం చేసి, జూన్ 7న ఇంటి యజమానురాలు నిద్రిస్తున్న సమయంలో బీరువా తాళాలు ఉపయోగించి బంగారు ఆభరణాలను అపహరించినట్లు తెలిపారు. అనంతరం వాటిని తన ఇంటికి తీసుకెళ్లి భర్తకు అప్పగించి, ఒక బంగారు గొలుసును ఇల్లందులోని సీఎస్పీ బ్యాంకులో తాకట్టు పెట్టి వచ్చిన నగదుతో అప్పులు తీర్చడంతో పాటు వ్యక్తిగత అవసరాలకు వినియోగించిందన్నారు. మిగిలిన బంగారు ఆభరణాలను ఖమ్మంలో విక్రయించేందుకు తీసుకెళ్తుండగా ఇల్లందు కరెంట్ ఆఫీస్ వద్ద బస్సు కోసం వేచి ఉన్న సమయంలో పెట్రోలింగ్ పోలీసులు అనుమానంతో విచారించగా నిందితురాలు నేరాన్ని అంగీకరించినట్లు వివరించారు.
నిందితురాలి వద్ద నుంచి రెండు వరుసల బంగారు తాడు, నల్లపూసల బంగారు గొలుసు, మంగళసూత్రాల జత, బంగారు ఉంగరాలు, చెవి కమ్మలు, చంద్రహారం తదితర సుమారు 83 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని, చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇళ్లలో పనివారిని నియమించుకునే ముందు వారి పూర్తి వివరాలు సేకరించి, అవసరమైతే స్థానిక పోలీస్ స్టేషన్‌లో పోలీసు ధ్రువీకరణ చేయించుకోవాలని ప్రజలకు డీఎస్పీ వెంకన్న బాబు సూచించారు. ఈ సమావేశంలో ఇల్లందు సీఐ టి.సురేష్, ఎస్సై ఉమా, కానిస్టేబుల్ రవి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






